కార్తికేయుడి సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కార్తికేయుడి సన్నిధిలో భక్తుల రద్దీ

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

కార్తికేయుడి సన్నిధిలో భక్తుల రద్దీ తొలి గంటలోనే దొంగ ఓటు తిరుపతమ్మ ఆలయ ఈఓ బాధ్యతల స్వీకరణ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన చెత్త బండిలో ఎన్నికల సిబ్బందికి భోజనాలు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. పుట్ట, స్వామి దర్శనం క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయమంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.6,60,159 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్‌ మొదలైన తొలి గంటలోనే దొంగ ఓటు నమోదైంది. 44వ డివిజన్‌ పరిధిలోని కొత్త అమ్మవారి దేవస్థానంలోని పోలింగ్‌ బూత్‌లో ఈ ఘటన జరిగింది. ఈ డివిజన్‌కు చెందిన మజ్జి ఈశ్వరరావు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7.30 గంటలకు పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. పావు గంట పాటు క్యూలైన్‌లో నిల్చున్న తర్వాత తన ఓటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వేసినట్లు పోలింగ్‌ ఏజెంట్‌తో పాటు అధికారి చెప్పడంతో ఒక సారిగా అవాక్కయ్యారు. పోలింగ్‌ ప్రారంభమైన గంటలోనే దొంగ ఓటు పడటంతో ఈశ్వరరావు ఒక సారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పోలింగ్‌ మొదలైన గంటలోనే దొంగ ఓటు పడటంతో ఈశ్వరరావు ఎన్నికల అఽధికారితో పాటు పోలింగ్‌ ఏజెంట్లను ప్రశ్నించారు. చివరకు మజ్జి ఈశ్వరరావు చాలెంజ్‌ ఓటు వేశారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత అన్ని పోలింగ్‌ స్టేషన్లలోనూ ఓటరు గుర్తింపు కార్డును ఒకటికి రెండు సార్లు పరిశీలించారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయ ఈఓగా నూతక్కి వెంకటసాంబశివరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆలయ ఈఓ జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లటంతో తిరుమలగిరి ఈఓగా పనిచేస్తున్న సాంబశివరావుకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పమిడిముక్కల: మండలంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఆదివారం పర్యటించింది. గోపువానిపాలెం, చోరగుడి, కృష్ణాపురం, ఐనపూరు గ్రామాల్లో పర్యటించి నేలవాలిన వరి చేలను పరిశీలించారు. నేలవాలిన, నీటిలో ఉన్న వరి పైరును రక్షించుకునేందుకు రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మురుగునీటి పారుదల, తెగుళ్ల నివారణ, గింజల మొలక నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గోపాలస్వామి, విజయభాస్కరరెడ్డి, లహరి, ఏఓ గణేష్‌రెడ్డి, ఏఈఓ సునీల్‌, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మునిసిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భోజనాలు పంపిణీ చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా పట్టణంలోని వీధుల్లో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనంలోనే ఎన్నికల సిబ్బందికి ఆదివారం ఆహారాన్ని సరఫరా చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ భోజనాలు సరఫరా చేయాల్సి ఉండగా, ఇలా చెత్త సేకరణ వాహనంలో తీసుకురావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement