పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ యథేచ్ఛగా రిగ్గింగ్, దౌర్జన్యాలు మాజీ మంత్రి పేర్ని నాని
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) విమ ర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, ప్రజల గొంతు నొక్కేయడంలో ప్రభుత్వం అన్ని హద్దులూ దాటిందని మండిపడ్డారు. ఆదివారం హిందూ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు బలం, రౌడీలు, గూండాల అండ, కొంతమంది అధికారుల సహకారంతో ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో వ్యవస్థలను లొంగదీసుకుని గెలిచినంత మాత్రాన అది నిజమైన విజయమవదన్నారు.
స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదు..
ప్రజల స్వేచ్ఛాయుతమైన ఓటు హక్కును అడ్డు కుంటూ, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించకుండా నిరోధిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఉద్యోగులు వినియోగించుకునే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కూడా రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న అధికారులు అన్యాయాన్ని అడ్డుకోకుండా మౌనంగా ఉండటం దారుణ మని విమర్శించారు. పదవుల నుంచి దిగిపోయిన తర్వాత సమాజంలో తలెత్తుకుని తిరగగలరా, ప్రజలను ఎదుర్కోగలరా అని ప్రశ్నించారు.


