ఎర్రుపాలెం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన గొర్రల సత్యనారాయణరెడ్డి – సుభద్ర దంపతులు రూ.1,00,116 నగదు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకుడు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో అధ్యాపకుల పాత్ర కీలకమని భారతీయ యువశక్తి ట్రస్ట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఏఎల్‌ఎన్ ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోక్టరింగ్ సెల్ ఆధ్వర్యంలో భారతీయ యువశక్తి ట్రస్ట్ సహకారంతో శనివారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎల్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి, వారి సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ లక్ష్యాలను అభివృద్ధి చేసేలా అధ్యాపకులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మెంటరింగ్, మార్గదర్శకత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తున్న విధానాలను వివరించారు. అనంతరం అధ్యాపకులతో ముఖాముఖి చర్చ నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు అందించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చిట్టా అమర్ సుధీర్, కోశాధికారి కాజా రాఘవయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శరవణ కుమార్, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ వి.చంద్రశేఖరరావు, ప్రోక్టరింగ్ సెల్ కన్వీనర్ ఎస్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్
జిల్లా అధ్యక్షుడు సాయిరామ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుప్రీం కోర్టు తీర్పు ఉత్తర్వుల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిరామ్, తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్‌ను కలిసి సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు దోహదం చేస్తాయన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కోడూరు: వేడి నీటి కోసం స్నానాల గదిలో ఏర్పాటు చేసిన వాటర్ హీటర్ కారణంగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నాగరాజు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన కడవకొల్లు నాగబాబు (52) శుక్రవారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో వేడి నీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ హీటర్ నుంచి విద్యుత్‌షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్నికుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


