మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ యూనివర్సిటీ విద్యతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక గాంధీనగర్‌లోని శారద కళాశాల ఆవరణలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల చెస్ పోటీలు సోమవారం జరిగాయి. పోటీల ప్రారంభ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పెంచుకోవాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ నుంచి మంచి ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏటా యూనివర్సిటీ స్థాయిలో అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించడంతో పాటు జాతీయ స్థాయి క్రీడా పోటీలను కూడా తమ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోందని చెప్పారు. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామ నారాయణ మాట్లాడుతూ శారద కళాశాల ఏటా కొత్త కోర్సులను అందిస్తూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోందన్నారు. శారద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీధర్, శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ ఎస్‌ఎన్‌వీ ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ఫణి కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి.నాగేశ్వరశాస్త్రితో పాటుగా కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి 50 మంది క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరావు


