పామర్రు: పామర్రులో ఢిల్లీ బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య నిఘా, స్వచ్ఛతా నివేదికల (స్పెషల్ కాంపెయిన్ 6.0) తనిఖీల్లో భాగంగా సోమవారం ఉయ్యూరు డివిజిన్ పరిధిలోని పామర్రు పంచాయతీ ఏరియాలో కేంద్ర ఉన్నతాధికారుల బృందం (సెంట్రల్ టీమ్) విస్తృతంగా పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత తనిఖీల్లో భాగంగా డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ స్వర్ణలత కేంద్ర బృందంతో కలిసి స్వయంగా క్షేత్ర పరిశీలనలో పాల్గొన్నారు. గ్రామాల్లో తడి–పొడి చెత్త వేర్పాటు, వర్మీకంపోస్టు తయారీ, సేంద్రియ వ్యర్థాల వినియోగం, పరిసరాల పరిశుభ్రతపై సదరు కేంద్రాల్లో వారు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, అంగన్‌వాడీల పనితీరుపై ఆరా తీశారు. పామర్రు పంచాయతీ పరిధిలోని చెత్త సంపద కేంద్రం పనితీరును, తడి, పొడి చెత్త ఏర్పాటు విధానాన్ని అధికారులు పరిశీలించారు. తర్వాత మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కేంద్ర బృందం సందర్శించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం పంపిణీ తీరును అంగన్‌వాడీల నిర్వహణ రిజిస్టర్లును పక్కాగా తనిఖీలు చేశారు. చిన్నారుల ఆరోగ్య రక్షణతో పాటు పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని కేంద్ర ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర బృందానికి క్షేత్ర స్థాయిలో ప్రగతి నివేదికలను, పారిశుద్ధ్య చర్యల వివరాలను పంచాయతీ అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారుల కేంద్ర బృందం సభ్యులు బాలాజీ, ఆదిత్య, డెప్యూటీ ఎంపీడీవో ఎస్.స్నేహలత, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.


