ఇంద్రకీలాద్రి అరుణార్ణవం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రి అరుణార్ణవం

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

ఇంద్రకీలాద్రి అరుణార్ణవం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మకు ప్రీతికరమైన అరుణ వర్ణంతో ఇంద్రకీలాద్రి దేదీప్యంగా వెలిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల అనంతరం భవానీమాలధారు రద్దీ కొనసాగుతోంది. భవానీ మాలధారుల రాకతో ఇంద్రకీలాద్రి, కనకదుర్గనగర్‌ తదితర ప్రాంతాలన్నీ ఎరుపురంగు సంతరించుకున్నాయి. దసరా ఉత్సవాలు ముగిసి రెండు రోజులైనా భవానీల తాకిడి ఏకరీతిలో కనిపిస్తోంది. శుక్ర వారం కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశాలు ఉండ టంతో ఆలయానికి చెందిన అన్ని విభాగాలు అప్రమత్తమయ్యాయి. దసరా ఉత్సవ ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు ప్రకటించారు. భక్తులు అందరూ క్యూలైన్లలోనే ఆలయానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భవానీలను క్యూలైన్లతో పాటు ఘాట్‌ రోడ్డు మీదగా కొండపైకి అనుమతించారు. క్యూలైన్లలో కొండపైకి చేరుకున్న భవానీలకు సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, బంగారు వాకిలి ద్వారా దర్శనానికి అనుమతించారు. ఘాట్‌రోడ్డు మీదుగా నడిచి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భవానీలను డోనర్‌ సెల్‌ వద్ద హోల్డింగ్‌ పాయింట్‌ తరహాలో నిలుపుదల చేశారు. అక్కడి నుంచి విడతల వారీగా భవానీలను గాలిగోపురం, సీఎం గేటు మీదగా బంగారు వాకిలి దర్శనానికి అనుమతిస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు, పూల మార్కెట్‌ హోల్డింగ్‌ పాయింట్లలో రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసిన ఆలయ అధికారులు అందుకు తగినట్లుగా కంపార్టుమెంట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దసరా ఉత్సవాలు, భవానీల రద్దీ నేపథ్యంలో ఇప్పటి వరకు 8.37 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని కొండ దిగే భవానీలకు అన్న ప్రసాద సదనంలో అన్నప్రసాదం, అల్పాహారం పంపిణీ చేస్తున్నామని, అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు హోల్డింగ్‌ పాయింట్లలో వేచి ఉండే భవానీలకు ఫుడ్‌ ప్యాకెట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. 4.34 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6.45 లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లతోపాటు, భక్తులకు అవసరమైన మేర మంచినీటి బాటిళ్లు అందుబాటులో ఉంచామన్నారు. దసరా ఉత్సవాలలో భక్తులు, భవానీలు కనక దుర్గమ్మ అమ్మవారికి సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను ఈ నెల 26, 27 తేదీల్లో లెక్కించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఈ కానుకల లెక్కింపు జరుగుతుంది. ఉత్సవాలు ముగిసిన వెంటనే కానుకల లెక్కింపు నిర్వహించడంపై కొంత మంది ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 15 రోజులుగా దసరా విధుల్లో ఉన్న సిబ్బందికి కనీసం ఒకటి, రెండు రోజులు కూడా సెలవులు లేకుండా కానుకల లెక్కింపు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదని వాపోతున్నారు.

● అన్ని దారులూ దుర్గమ్మ సన్నిధికే..

● తరలివస్తున్న భవానీ మాలధారులు

● నేడు కూడా రద్దీ కొనసాగే అవకాశం

క్యూలైన్లు, ఘాట్‌ రోడ్డు మీదుగా అనుమతి

8.37 లక్షల మందికి అన్నప్రసాద వితరణ

26, 27తేదీల్లో కానుకల లెక్కింపు

గురువారం ఆదాయం రూ. 41.66 లక్షలు

భవానీల రద్దీ నేపథ్యంలో గురువారం దుర్గగుడికి రూ.41.66 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.36.25 లక్షలు, శ్రీచక్ర (పెద్ద) లడ్డూ విక్రయం ద్వారా రూ.4,900, కేశఖండన టికెట్ల ద్వారా రూ.5.27 లక్షలు, అమ్మవారి పుస్తకాలు, ఫొటోల విక్రయం ద్వారా మిగిలిన ఆదాయం వచ్చిందని వివరించారు.

దుర్గమ్మ దర్శనానికి వస్తున్న భవానీ మాలధారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement