చిలకలపూడి/కోనేరుసెంటర్(మచిలీపట్నం): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజైన గురువారం కొనసాగింది. జిల్లా పరిషత్ సమావేశపు హాలు వద్దకు ఆయా పార్టీల అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి రావటం ప్రారంభించారు. పోలీసులు అభ్యర్థితో పాటు మరో ఇద్దరినే నామినేషన్ కేంద్రానికి అనుమతించారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణతో పాటు జిల్లాలోని 26 మండలాలను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్లను పరిశీలించి నామినేషన్ల పత్రాల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు ఏదైనా తెలియని సమాచారం ఉంటే వారికి తెలియజేసి సజావుగా నామినేషన్ పత్రం దాఖలు చేసేలా సహకరించాలని సూచించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బందోబసు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రెండో రోజు 68 నామినేషన్లు
జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. గురువారం ఆయా పార్టీల అభ్యర్థులు కొన్ని మండలాలకే నామినేషన్లు దాఖలు చేశారు. 68 నామినేషన్లు దాఖలవగా వైఎస్సార్ సీపీ నుంచి 21, టీడీపీ నుంచి 33, బీజేపీ నుంచి రెండు, కాంగ్రెస్ నుంచి నాలుగు, బీఎస్పీ నుంచి మూడు, సీపీఎం నుంచి రెండు, జనసేన నుంచి ఒకటి చొప్పున నామినేషన్లు అందాయి. ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు.
ఎంపీటీసీ స్థానాలకు 815 నామినేషన్లు
జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలకు గానూ బుధ, గురువారాల్లో 815 నామినేషన్లు దాఖలైనట్లు జెడ్పీ సీఈఓ మోమిడి శ్రీహరి గురువారం తెలిపారు. వైఎస్సార్ సీపీ నుంచి 362, టీడీపీ నుంచి 330, బీఎస్పీ నుంచి 2, బీజేపీ 17, సీపీఎం 8, కాంగ్రెస్ 2, జనసేన 68, ఇండిపెండెంట్లు 26 చొప్పున 815 నామినేషన్లు దాఖలయ్యాయి.
గెలుపే లక్ష్యంగా పావులు
జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తమ పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతున్నారు. పల్లె, పట్నం తేడాలేకుండా నాయకులు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను, భవిష్యత్తు ప్రణాళికలను ఓటర్లకు వివరిస్తు తమకు మద్దతు పలికి అఖండ మెజార్టీ అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా డిజిటల్ ప్రచారం జోరందుకుంది. ప్రధాన కూడళ్లు, వీధులు, భవనాలపై రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి.
బందరులో భారీ ర్యాలీలు..
బందరులో నామినేషన్‌ల ప్రక్రియ పోటాపోటీగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌లు వేస్తున్నారు. అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్‌లు వేసేందుకు తరలివస్తున్నారు. బందరు మండలం నార్త్ మండలం జెడ్పీటసీ అభ్యర్థిగా శొంఠి కల్యాణి నామినేషన్ వేశారు. రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), పార్టీ నాయకులు బొర్రా విఠల్, లంకే వెంకటేశ్వరరావు, శొంఠి ఫరీద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.


