గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.24,19,354 ఆదాయం సమకూరింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.23,66,053, అన్నదానం హుండీ ద్వారా రూ.53,301, మొత్తం రూ.24,19,354 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 700 మిల్లీ గ్రాములు, 500 గ్రాముల వెండి సమకూరిందని జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎన్.సాంబశివరావు తెలిపారు. కానుకల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్.సంధ్య తదితరులు పాల్గొన్నారు.
కంచికచర్ల: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరగాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు నాగ లక్ష్మి పేర్కొన్నారు. కంచికచర్ల, వీరులపాడు, నందిగామలో నామినేషన్ కేంద్రాలను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమ యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టంచేశారు. సమస్యాత్మక, అతి సమస్యా త్మక గ్రామాలను ముందుగా గుర్తించి అదనపు పోలీస్ బలగాలను మోహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం పెంపొందించేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి బాలాజీ, ఎంపీడీఓ డి. వెంకటేశ్వరరావు డెప్యూటీ తహసీల్దార్ మానస తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: విద్యార్థులు భవిష్యత్తు నైపుణ్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి సీతామహాలక్ష్మి సూచించారు. పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె సందర్శించి లెవల్–2 రిటైల్ ట్రేడ్ విద్యార్థులతో మాట్లాడారు. రిటైల్ ట్రేడ్‌లో కేరీర్ అవకాశాలను వివరించారు. భవిష్యత్ నైపుణ్యాలు, స్వయం ఉపాధి మార్గదర్శకాలపై విలువైన సూచనలు చేశారు. పెనమలూరులో ఇంటర్న్‌షిప్ కేంద్రంగా ఉన్న శ్రీ విజయలక్ష్మి రైస్ అండ్ జనరల్ స్టోర్స్ సందర్శించి డిజిటల్ మెషిన్‌తో తూకం, ప్యాకేజి చేయడం, స్టాక్ అమరిక వంటి ప్రాక్టికల్ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి జి.పద్మజ, సాయిరామ్, హెచ్‌ఎం సుధారాణి, డి.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
పెదప్రోలు(మోపిదేవి): మండలంలోని పెదప్రోలు రైతు సేవాకేంద్రంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఘంటసాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి ఆయా పంటల్లో సస్యరక్షణ చర్యలను వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి కె.హెప్సీబారాణీ, పద్మజ, శ్రీనివాస్, అవనిగడ్డ ఏడీఏ జయప్రద, తదితరులు పాల్గొన్నారు.


