నిధులు దండిగా.. ప్రగతి మెండుగా | - | Sakshi
Sakshi News home page

నిధులు దండిగా.. ప్రగతి మెండుగా

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

నిధులు దండిగా.. ప్రగతి మెండుగా గత ప్రభుత్వం హయాంలోనే మెరుగైన వసతులు రోడ్లు, రవాణా సదుపాయాలు

ల్యాండ్‌ స్కేపింగ్‌.. పర్యాటకం

● వైఎస్సార్‌ సీపీ హయాంలో
గత ప్రభుత్వం హయాంలోనే మెరుగైన వసతులు

● అన్ని డివిజన్లలో మౌలిక

వసతుల కల్పనకు కృషి

● వీఎంసీ సాధారణ నిధుల

నుంచి రూ.3వేల కోట్లు ఖర్చు

● రూ.11 కోట్లతో అందంగా

రివర్‌ ఫ్రంట్‌ పార్కు ఏర్పాటు

పటమట(విజయవాడతూర్పు): వైఎస్సార్‌ సీపీ పాలనలో 2021 నుంచి 2026 మధ్య కాలంలో విజయవాడ నగరం గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు సమకూరాయి. 2021లో విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ)కు ఎన్నికలు జరిగి వైఎస్సార్‌ సీపీ పాలనా బాధ్యతలు చేపట్టింది. కౌన్సిల్‌ పదవీ కాలం పూర్తయ్యే నాటికి వీఎంసీ సాధారణ నిధుల నుంచి అభివృద్ధి పనులకు సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏటా రూ.100 కోట్లు, రూ.50 కోట్ల ప్రత్యేక నిధుల వెచ్చించి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించారు. మేయర్‌గా పనిచేసిన రాయన భాగ్యలక్ష్మి నేతృత్వంలో నగరాభివృద్ధికి గణనీయమైన కృషి జరిగింది. అందుకే మళ్లీ భాగ్యలక్ష్మినే మేయర్‌ అభ్యర్థిగా నిలబెట్టి వైఎస్సార్‌ సీపీ ఎన్నికల బరిలో నిలిచింది. గత ఎన్నికల్లో మొత్తం 64 డివిజన్లకు వైఎస్సార్‌ సీపీ 49 గెలుచుకోగా, టీడీపీ 14 డివిజన్లు, సీపీఎం ఒక డివిజన్‌కు పరిమితమయ్యాయి. మేయర్‌ భాగ్యలక్ష్మి సారథ్యంలో వివక్షకు తావు లేకుండా అన్ని డివిజన్లకు నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపారు.

కాలువల్లో వ్యర్థాల తొలగింపు

నగరం మీదుగా ప్రవహించే ఏలూరు, బందరు, రైవస్‌ కాలువ గట్లను పటిష్టం చేశారు. సుందరీకరణలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన 19 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను టక్సర్‌ వాహనాలతో తొలగించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డును అభివృద్ధి చేయటంతోపాటు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ కోసం ఇన్‌ఫర్‌మేషన్‌ పార్కును రూ.8 కోట్లతో అభివృద్ధి చేశారు. వాంబేకాలనీ, అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో అంతర్గత, ప్రధాన రోడ్లలో సెంట్రల్‌ డివైడర్‌ ఏర్పాటు చేసి, గ్రీనరీని అభివృద్ధి చేశారు.

తాగు నీటి సరఫరాకు సమర్థ ప్రణాళిక

కొండ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో సమర్థ ప్రణాళిక అమలు చేశారు. అన్ని డివిజన్లలో వీఎంసీ సాధారణ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు, కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులతో తాగునీటి పైపులైన్లను ఆధునికీకరించారు. వేలాది ఇళ్లకు నూతన కుళాయి కనెక్షన్‌ ఇవ్వటంతోపాటు భవానీపురంలోని హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను అభివృద్ధి చేశారు. సైడు డ్రెయిన్లు, భూగర్భ డ్రెయిన్లను ఆధునికీకరించారు. యూఎన్‌డీపీ నుంచి వచ్చిన రూ.100 కోట్లతో రామలింగేశ్వనగర్‌లోని మూడు ఎస్‌టీపీ (సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)లు, జక్కంపూడికాలనీ, ఆటోనగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎస్‌టీపీలను ఆధునికీకరించారు. వాటికి అనుబంధంగా ఉండే పంపింగ్‌ స్టేషన్లు రూ.10 కోట్లతో అభివృద్ధి చేశారు.

పారిశుద్ధ్యం.. పర్యావరణం

నగరంలోని అన్ని డివిజన్లలో ఇంటింటి నుంచి చెత్త సేకరణతోపాటు ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డును లిట్టర్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించి నిరంతరం శుభ్రంగా ఉంచారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) ద్వారా ఇంటింటి నుంచే చెత్త సేకరించి, సులభంగా రవాణా చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు 2021, 2022, 2023వ సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాకింగ్‌ అవార్డులు లభించాయి. కాలుష్యాన్ని నివారించేందుకు రోడ్ల వెంబడి దుమ్ము, ధూళి గాలిలో కలవకుండా 15 ప్రధాన జంక్షన్ల వద్ద ఫౌంటేన్లు ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్లలో రోడ్లకు రెండు వైపులా పేవర్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించారు.

నగర సుందరీకరణలో భాగంగా రాజీవ్‌గాంఽధీ పార్కు, రాఘవయ్య–అంబేడ్కర్‌ పార్కును అభివృద్ధి చేయటంతోపాటు కృష్ణానదీ తీరాన రాణిగారితోటలో మూడు కిలోమీటర్ల పొడవున మూడు ఫేజులుగా రివర్‌ ఫ్రంట్‌ వ్యూ పార్కును రూ.11 అభివృద్ధి చేశారు. కృష్ణానదికి ఆనుకుని ఉన్న రిటైనింగ్‌ వాల్స్‌కు అనుబంధంగా మొదటి ఫేజ్‌లో కిలోమీటరు వరకు వాకింగ్‌ ట్రాక్‌, చైల్డ్‌ ప్లే ఏరియా, సైక్లింగ్‌ ట్రాక్‌ తదితర నిర్మాణాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పార్క్‌ల అభివృద్ధి, నగర వ్యాప్తంగా ఓపెన్‌ జిమ్‌లు, వాకింగ్‌ ట్రాక్‌లతో కూడిన మూడు కొత్త పార్కులను హార్టీకల్చర్‌ విభాగం ద్వారా అభివృద్ధి చేశారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు చాలక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రధాన ప్రాంతాల్లోనూ రోడ్ల విస్తరణ ఓ ప్రహసనంగా ఉండేది. వైఎస్సార్‌ సీపీ పాలనా బాధ్యతలు చేపట్టి వన్‌టౌన్‌లో కొత్తూరు తాడేపల్లి (కేటీ) రోడ్డును 60 నుంచి 80 అడుగులకు విస్తరించి, శాశ్వత ప్రాతిపాదికన రూ.9 కోట్లతో కేబీఎన్‌ కళాశాల నుంచి కొత్త అమ్మవారి గుడి వరకు రెండు ఫేజులుగా సీసీ రోడ్డు నిర్మించారు. బ్రాహ్మణ వీధిని వెడల్పు చేయంతోపాటు రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేశారు. భవానీపురం, విద్యాధరపురం, చిట్టినగర్‌, పూర్ణానందంపేట, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలు పూర్తిచేశారు. కేఎల్‌ రావు పార్కును రూ.4 కోట్లతో అభివృద్ధి చేసి, కొండప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు నూతన పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. వాగు సెంటర్‌ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడకుండా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు ఖర్చుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement