క్రమబద్ధీకరించే వరకూ పోరు ఆగదు | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరించే వరకూ పోరు ఆగదు

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

సంఘీభావం..

మచిలీపట్నంఅర్బన్‌: వైద్య, ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్టు పేరుతో నిరంతరం సేవలు చేయించుకుంటూ హక్కులను విస్మరించడం సరికాదని ఉద్యోగులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుత నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ) జిల్లా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్టు వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ సభ్యులు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అత్యవసర సేవలతో సహా పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ‘దశాబ్దాల సేవకు గుర్తింపు కావాలి.. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ కావాలి’ అంటూ నినాదాలు చేశారు.

కాలయాపన సరికాదు..

జిల్లా చైర్మన్‌ పులి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థలో సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. క్రమబద్ధీకరణ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడంతో ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలను నిరంతరం ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రెండో రోజు కొనసాగిన

కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల నిరసన

ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరసనకు తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి పోరాటానికి అండగా నిలిచి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ కన్వీనర్‌ బాలు, కోఆర్డినేటర్‌ లోకేష్‌కుమార్‌, సౌమ్య రేఖ, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ కోశాధికారి శోభన్‌ బాబు, జాయింట్‌ సెక్రటరీ ఎం. రజని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. రమణ, శైలజదేవి, వైద్య, ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement