అర్ణబ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అర్ణబ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): అర్ణబ్‌ తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికా రులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె. బాలాజీ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లతో తుపాను సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు తప్పనిసరిగా తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. వీలై నంత వరకు పోలింగ్‌ కేంద్రాలకు వేరుగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. చెట్లు కూలి రవాణాకు అంతరాయం లేకుండా జేసీబీలు, పవర్‌ యంత్రాలు, ట్రాక్టర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా అదనపు స్తంభాలు, కార్మిక బృందాలు, క్రేన్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రేషన్‌ షాపులకు నిత్యావసర సరుకుల రవాణాను వేగవంతం చేసి, ఆహార కొరత రాకుండా చూడాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. అన్ని మండల, డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి, వాటి ఫోన్‌ నంబర్లను ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

మచిలీపట్నంఅర్బన్‌: అర్ణబ్‌ తుపాను నేపథ్యంలో తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ సూచించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని శనివారం రాత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) కార్యాల యాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించాలని, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ ఆదేశించారు. మత్స్యకారులు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 08672–252399ను అత్యవసర సహాయం కోసం సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement