డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలి

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

మెగా డీఎస్సీ అంటూ అర్హులను దగా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి వైఎస్సార్‌ సీపీ తూర్పు టౌన్‌హాలు మీటింగ్‌లో వక్తలు డిమాండ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో సమావేశం

లబ్బీపేట(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ– 2025లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసినా స్పందన లేదని దగా పడిన అభ్యర్థులు విమర్శించారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులకు తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేష్‌ రాజీనామా చేయా లన్న డిమాండ్లతో వైఎస్సార్‌ సీపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో సోమవారం టౌన్‌హాల్‌ సమావేశం జరిగింది. రామవరప్పాడులోని ఎం కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొని ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాటం

కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు జరిగిన అన్యా యంపై కొన్ని నెలలుగా వైఎస్సార్‌ సీపీ ఉద్యమిస్తోందని పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జెన్‌జీ యువత పోరాడుతోందన్నారు. యువతకు న్యాయం జరగా లంటే వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ వస్తేనే విద్యార్థుల భవిష్యత్‌ బాగుంటుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని, డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

అక్రమాలను సాక్ష్యాలతో చూపించాం

డీఎస్సీలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో వైఎస్‌ జగన్‌ చూపించారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి లోకేష్‌ మాట్లాడితే చర్చకు రమ్మంటున్నారని, ముందు అన్యాయం జరి గిన అభ్యర్థులతో మాట్లాడాలని హితవు పలికారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే అందరి భవిష్యత్‌ బాగుంటుందన్నారు.

పరీక్ష రాయకుండానే పోస్టులు

ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేయవచ్చో, డీఎస్సీలో అన్ని రకాలుగా చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పరీక్ష రాయకుండానే పోస్టులు ఇచ్చేలా జీఓలు తెచ్చి, అనుకున్న వారికి ఉద్యోగాలు రాగానే ఆ జీఓలను రద్దు చేశారని విమర్శించారు. కూటమి నిష్పక్షపాతంగా ఉంటే సీబీఐ విచారణకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్‌ జగన్‌ రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కూటమి పాలనలో విద్యార్థులకు నష్టం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. కూటమి పాలనలో విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు గళం విప్పితే కేంద్ర ప్రభుత్వం భయపడిందని, జెన్‌జీ యువత పోరాటం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి 420 పోస్టులకు కనీస అర్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య(వర), రాష్ట్ర పెన్షన్‌ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సోషల్‌ మీడియా విభాగం అర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ డి.అంజిరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement