లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ‘పైసలిస్తేనే..ప్రాక్టికల్ మార్కులు’ అనే శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో డీఎంఈ కార్యాలయంలోని నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను పిలిచి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నారా అని అడిగారు. అలా నాలుగో ఏడాది విద్యార్థులు అందరినీ పిలిచి వారి వద్ద నుంచి లెటర్‌లు రాయించుకున్నారు. వారితో పాటు ఫ్యాకల్టీ సభ్యులను సైతం ఆమె విచారణ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో నర్సింగ్ కళాశాలకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ సాయంత్రం 5 గంటల వరకూ ఉన్నారు. ఇక్కడ విచారణలో తేలిన అంశాలను రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
బలవంతంగా లెటర్..
మా ఇష్ట పూర్వకంగానే కళాశాలకు ఫండ్ ఇచ్చాం అంటూ విద్యార్థులపై వత్తిడి చేసి లెటర్‌లు ఇప్పించినట్లు తెలిసింది. అలా రాయకుంటే ప్రిన్సిపాల్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో విద్యార్థినిలు తప్పనిసరి పరిస్థితులో లేఖలు రాసినట్లు పలువురు చెబుతున్నారు. ‘ఇష్టపూర్వకంగా ఇస్తే ఆర్థికంగా ఉన్న వాళ్లు ఇస్తారు.. పేద విద్యార్థులు కూడా డోనేషన్ ఇస్తారా అని’ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ
విద్యార్థులను విచారణ చేసిన నర్సింగ్ డీడీ


