కూటమి పాలనలో అందరికీ వెన్నుపోటే..
పథకానికి వేలాది మందిని అనర్హులుగా తేల్చిన కూటమి సర్కార్ ఉమ్మడి జిల్లాలో 17,198 మంది తల్లులకు ఎగవేత కొత్త కొత్త కొర్రీలు పెడుతూ ఎగనామం సచివాలయాల వద్ద అర్హుల జాబితాలు
తల్లిదండ్రుల ఆగ్రహం..
ఆంక్షల ‘వందనం’.. అర్హుల రోదనం
కూటమి పాలనలో అందరికీ వెన్నుపోటే. యువత, విద్యార్థులు, రైతులు ఇలా అందరికీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. తాజాగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడిని నేడు తల్లికి వందనం పేరు పెట్టి దిగజారుస్తున్నారు. ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అని చెప్పి తల్లులనే తగ్గించి వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి తల్లికివందనం పథకాన్ని ఎగ్గొడుతున్నారు.
– ఎ. రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేవలం పేరు మార్చడం మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది తల్లులకు పలు కారణాల పేరుతో అనర్హులుగా ప్రకటించి ఎగ్గొడుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి పిల్లవాడికి అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడి చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు కేవలం ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే వేలాది మంది తల్లులకు ఎగనామం పెట్టిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఆంక్షల పేరుతో ఎగవేత..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పలు కారణాలు చూపుతూ వేలాది మందికి ఈ పథకాన్ని ఎగవేసేందుకు పాలకులు కుట్ర చేశారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పది వేలు, పట్టణాల్లో 12వేలకు మించి ఆదాయం ఉంటే వారికి ఈ పథకం వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉంటే వారికి సైతం ఈ పథకం వర్తించదు. అలాగే గత ఏడాది పది, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఈ పథకంలో చూపటం లేదని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకంలో పేర్లు కనిపించటం లేదని పలువురు వివరిస్తున్నారు. అదే విధంగా ఐటీ రిటర్న్స్ పేరుతో చాలా మందిని దీనిలో అనర్హులుగా ప్రకటిస్తూ జాబితాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఐటీ చెల్లించటం లేదని వారంతా ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2023లో 3,00,120 మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదును వేసింది. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,29,533 మంది తల్లులకు, ఎన్టీఆర్ జిల్లాలో 1,70,587 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,82,922 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ అయ్యేటట్లుగా నిధులను విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,23,110 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 1,59,812 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,198 మంది తల్లులకు ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 6,423 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10,775 మందికి మొండి చెయ్యి చూపుతోంది.
అప్పుడు విమర్శించి.. అదే పని..
గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల నగదును జమ చేసినప్పుడు కూటమి నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. ఎన్నికల వేళ నీకు15 వేలు, నీకు 15 వేలు.. అంటూ హడావుడి చేశారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిన తరువాత అదే రూ.13వేలనే వేసి మిగిలిన రెండు వేలను పాఠశాలల అభివృద్ధి పేరుతో పక్కదోవ పట్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఆ రెండు వేలు చొప్పున ఏ విద్యాసంస్థకు కేటాయించలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరిస్తున్నారు.
వార్డు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు. అయితే గతంలో అమ్మ ఒడి పథకం తీసుకున్న వారి పేర్లు ప్రస్తుత జాబితాల్లో అనర్హులుగా కనపడుతుండటంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తాము తీసుకున్న ఈ పథకం ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటూ మండిపడుతున్నారు. సచివాలయాల సిబ్బంది మీ పేరు మీద కారు ఉందని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, స్థలం నమోదైందని పలు అంశాలను వివరిస్తున్నారు. అయితే తమకు మీరు చెబుతున్నవి ఏమి లేవంటూ వారు వాపోతున్నారు.


