విరాళాల కోసం ప్రత్యేక యాప్ 99 శాతం తల్లికి వందనం నగదు జమ విలేకరులతో కలెక్టర్ డీకే బాలాజీ
పీటీఎం యథాతథం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ విద్యా సంస్కరణల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు విడతల మెగా పీటీఎంలలో ఎక్కువగా తల్లులు మాత్రమే పాల్గొన్నారని, రేపు జూలై 24న జరగబోయే కార్యక్రమానికి ఈసారి తండ్రులు కూడా హాజరైతే పిల్లల విద్యా ప్రగతి, అభ్యాస స్థాయిపై ప్రత్యక్ష అవగాహనతో పాటు వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆధారంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా సమావేశమై విద్యార్థి అభ్యాస స్థాయి, బలాలు, లోపాలను మెరుగుపరిచే చర్యలపై సమగ్రంగా చర్చిస్తారని తెలిపారు.
డోనర్ యాప్..
‘డోనర్ యాప్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తమ గ్రామంలోని లేదా తాము చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించాలనుకునే పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతలు తమ శక్తి మేరకు ఈ యాప్ ద్వారా విరాళాలు అందించవచ్చని వివరించారు.
తల్లికి వందనం రాని వారు..
తల్లికి వందనం పథకం కింద జిల్లాలో దాదాపు 99 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమైందని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఎవరికై నా నగదు జమ కాకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తమ స్థితిని తెలుసుకుని ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు పాల్గొన్నారు.
సమన్వయంతో విజయవంతం చేయండి
అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక అధికారులకు, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం)పై అధికారులతో గురువారం తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలన్నారు. డీఈవోతో పాటు డీఐఈఓ సరళ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో ప్రయివేటు విద్యాసంస్థలు శుక్రవారం సెలవు ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై కృష్ణా డీఈవో యూవీ సుబ్బారావును వివరణ కోరగా.. తాము ఏ పాఠశాలకూ సెలవు కోసం అనుమతి ఇవ్వలేదని, పీటీఎం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు.


