పైసలిస్తేనే.. ప్రాక్టికల్‌ మార్కులు! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే.. ప్రాక్టికల్‌ మార్కులు!

Jul 24 2026 1:51 AM | Updated on Jul 24 2026 1:51 AM

ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వసూళ్ల దందా ప్రతి పనికీ డబ్బులే! స్టైపెండ్‌ ఇవ్వాలన్నా కమీషన్‌ చెల్లించాల్సిందే

లబ్బీపేట(విజయవాడతూరు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో వసూళ్ల దందా సాగుతోంది. అక్కడ ఏ పనిచేయాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. అంతేకాదు ప్రాక్టికల్‌ మార్కులు వేయాలంటే అడిగినంత చెల్లించాల్సిందే. చివరికీ పేద విద్యార్థినులకు వచ్చే స్టైపెండ్‌లో సైతం కమీషన్‌లు అడుగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక రికార్డులపై సంతకాలు పెట్టేందుకు సైతం టీచింగ్‌ స్టాఫ్‌ డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే, మీరు కోర్సు పూర్తి చేసి ఎలా వెళతారనే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

600 పైగా విద్యార్థినులు..

గత ప్రభుత్వం విజయవాడలో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా వంద మందికి అడ్మిషన్లు కల్పిస్తుంటారు. ప్రస్తుతం నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న వారు.. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారు అంతా కలిపి దాదాపు 604మంది ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్‌, టీచింగ్‌ సిబ్బందితో పాటు, అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది కూడా పనిచేస్తుండగా, దీని పర్యవేక్షణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆ కార్యాలయంలోని నర్సింగ్‌ విభాగం చూస్తుంటుంది. దీంతో ఇక్కడ ఏమి జరిగినా పట్టించుకునే వారే ఉండటం లేదు.

వసూళ్ల దందా..

నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థినుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఫైనలియర్‌ విద్యార్థినుల ప్రాక్టికల్స్‌ జరగ్గా, ఒక్కో విద్యార్థి రూ.4వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. విద్యార్థులు అంత ఇచ్చుకోలేమంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1500, రూ.2 వేలు చొప్పున దాదాపు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదంతా ప్రిన్సిపాల్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రిన్సిపాలే చేస్తుంటే తామేమైనా తక్కువా అంటూ టీచింగ్‌ సిబ్బంది సైతం రికార్డులపై సంతకాలు పెట్టేందుకు డబ్బులు వసూళ్లు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసి ఇస్తే ఒక రేటు, మార్కుల జాబితా ఇస్తే మరో రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

స్టైపెండ్‌ వచ్చినా వదలరు..

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాల మూతపడగా అక్కడి విద్యార్థులను ఈ కళాశాలకు ఎటాచ్‌ చేశారు. వారికి ఏడాదిన్నకు సంబంధించి ఒకేసారి రూ.25వేల నుంచి రూ.30వేల వరకూ స్టైపెండ్‌ వచ్చింది. వాటి నుంచి సైతం తలా రూ.3వేలు ఇవ్వాలంటూ విద్యార్థినులకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో చేసేది లేక అడిగినంత ఇచ్చినట్లు చెబుతున్నారు. వాళ్లు అక్కడ చదువుతుండటంతో బయటకు చెప్పేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూళ్ల దందా సాగిస్తున్న నర్సింగ్‌ కళాశాల ఆగడాలపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement