ఉమ్మడి కృష్ణా జిల్లాలోపంటల సాగుపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం తక్కువ వర్షపాతం నమోదు ముందస్తు నీటి నిల్వలు లేకపోవడంతో ఇక్కట్లు
కృష్ణా జిల్లాలో సాగు ఇలా..
ఎన్టీఆర్ జిల్లాలో సాగు వివరాలు..
సాక్షి, విజయవాడ : ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో డెల్టాకు ఈసారి సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా జూన్‌లో 108.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 142.7 మి.మీ. పడింది. జూలై నెల చివరి నాటికి 234.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ నెల 13వ తేదీ నాటికి 87.4 శాతం వర్షం పడాల్సి ఉండగా.. 5.6 మి.మీ మాత్రమే కురిసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నా చంద్రబాబు ప్రభుత్వం సాయం అందించకుండా ఎల్‌నినోపైనే నింద వేసి తప్పించుకునే యత్నం చేస్తోంది. ముందస్తు నీటి నిల్వలు చేపట్టకపోవడంతో మరింత ఇక్కట్లు తలెత్తుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు.. పంటలపై ఎఫెక్ట్
కృష్ణా జిల్లా పరిధిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైతులు నారుమడులు పోసేందుకు మొగ్గు చూపడం లేదు. అయితే పట్టిసీమ నీరు కృష్ణానదికి వస్తుండడంతో ఆ నీరు అందే అవకాశం ఉన్న రైతులు మాత్రం కాసింత ఆశగా ఉన్నారు. పట్టిసీమ నుంచి 7,080 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా, ఎగువ ప్రాంత రైతుల వినియోగం పోగా మిగిలిన 5,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని, గుంటూరు కాలువతో పాటు, జిల్లాలోని బందరు, కేఈబీ, రైవస్ తదితర ప్రధాన కాలువలకు ఆ నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టాలోని అన్ని ప్రధాన కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలంటే 18,600 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం విడుదల చేస్తున్న 5,500 క్యూసెక్కుల నీరు ఎంతమేర పంటలను కాపాడుతుందనేది వేచి చూడాలి. జూన్ నుంచి జూలై 12వ తేదీ వరకు జిల్లాలో 145.22 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 99.93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు సమయం మించిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంట సాగు కావాల్సింది ప్రస్తుతం (హెక్టార్లలో) సాగైనది
వరి 1,60,655 17,085
మొక్కజొన్న 56 22
కంది 11 00
పెసర 2 00
మినుము 1,412 00
ఉలవ 3 00
వేరుశనగ 661 00
కాటన్ 330 72
చెరుకు 2,641 852
మొత్తం 1,65,771 18,031
పంట సాగు కావాల్సింది ప్రస్తుతం–2026 (హెక్టార్లలో) ఖరీఫ్ నాటికి
వరి 48,831 1,127
జొన్న 2 0
మొక్కజొన్న 3,729 1,707
కంది 453 76
పెసర 3,796 2,340
మినుము 2833 1666
శనగ 1 0
వేరుశనగ 39 00
నువ్వులు 26 00
ఆముదం 4 0
కాటన్ 34,057 18,378
చెరుకు 428 43
మొత్తం 94,197 25,336


