టిప్పర్‌ ఢీకొని వృద్ధుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని వృద్ధుడు దుర్మరణం

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

టిప్పర్‌ ఢీకొని వృద్ధుడు దుర్మరణం కారు అదుపు తప్పి ప్రమాదం.. ఒకరి మృతి యాదవులంతా ఏకతాటిపైకి రావాలి

కోనేరుసెంటర్‌: టిప్పర్‌ ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్‌ రోడ్డులో ఆదివారం తెల్లవారుజాము చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ జి.రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం బందరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్‌కు చెందిన కాగిత పాండురంగారావు (80) అనే వృద్ధుడు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి రోజులానే ఆదివారం తెల్లవారుజామున ఊరి బయట ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా మంగినపూడి రోడ్డులోని శ్రీనివాస్‌నగర్‌ ప్రధాన కూడలి వద్ద బందరు పోర్టు వైపునకు లోడుతో వెళ్తున్న టిప్పర్‌ వృద్ధుడి ఢీకొంది. ఈ ప్రమాదంలో పాండురంగారావు టిప్పర్‌ కింద పడిపోయాడు. టిప్పర్‌ మధ్యలో ఇరుక్కున అతనిపై నుంచి టిప్పర్‌ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు హుటాహుటినా మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాండురంగారావు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్‌ఐ చెప్పారు.

లక్ష్మీపురం(తిరువూరురూరల్‌): ఇబ్రహీంపట్నం – జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్‌ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్‌(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్‌ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాజకీయాలు, కులం వేర్వేరని, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కుల ప్రయోజనాల కోసం యాదవులంతా ఏకతాటిపైకి రావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. విజయవాడలోని విజయ నర్సింగ్‌ కాలేజీలో యాదవ సంఘం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. యాదవులు లేనిదే చరిత్ర లేదన్నారు. యాదవులు శ్రీ కృష్ణుడి వారసులని... నీతి నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదట తెరిచేది కూడా మన గొల్ల మిరాశిలేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అన్నారు. యాదవులంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడ వంటి నగరంలో కార్పొరేషన్‌లో యాదవ కుల ప్రాతినిధ్యం చెప్పుకోతగిన స్థాయిలో ఉందన్నారు. ఇది గర్వించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. యాదవుల కుల దైవం శ్రీ కృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ‘ఎవరికి ఏ అవసరమొచ్చినా నేను ఉన్నానని గుర్తు పెట్టుకోండి.. నా పూర్తి అండదండలు ఉంటాయి’ అంటూ యాదవ సామాజిక వర్గానికి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయనను యాదవ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ అరవ వెంకట సత్యనారాయణ(అరవ సత్యం), విజయ నర్సింగ్‌ కాలేజీ అధినేతి తట్టి అర్జునరావు, డాక్టర్‌ వెంకట్‌ చరణ్‌ తేజ, ఐతా కిషోర్‌, నాగరాజు, ఎల్లయ్య, జోగారాజు, ఆగిరిపల్లి రాజు, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement