కృత్తివెన్ను: రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగైపోయాయని, ఇద్దరు గిరిజనులు దారుణంగా హత్యకు గురైతే కనీసం గిరిజన శాఖ మంత్రి గానీ, హోంశాఖ మంత్రి గాని స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ట్రైకర్ మాజీ చైర్మన్ సురేంద్ర అన్నారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో హత్యకు గురైన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ యానాదులు ఎంతో ధైర్యంగా సముద్రంలో వేటాడి ఒడ్డుకు రాగలుగుతున్నారు కానీ ఒడ్డు నుంచి ఇంటికి క్షేమంగా చేరలేకపోతున్నారని, దీనికి నిదర్శనమే ఈ జంట హత్యలు అని అన్నారు. నిరుపేద కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ హత్యల్లో స్థానికంగా ఉన్న వారితో పాటు, అధికారపార్టీ నాయకుల ప్రమేయం ఉందన్న అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. కారకులైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యతను పోలీసులు నిష్పక్షపాతంగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోతే వారి తరఫున, వైఎస్సార్ సీపీ ఎంతటి ఉద్యమానికై నా సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు యానాది గిరిజన ఫెడరేషన్ యూత్ స్టేట్ అధ్యక్షుడు ఎందేటి వెంకటసుబ్బయ్య, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లూరి శివయ్య, బాపట్ల జిల్లా యానాది యూత్ అధ్యక్షులు చౌటు రమేష్, గుంటూరు జిల్లా కార్యదర్శి కొమరగిరి సూరిబాబు, కందుకూరి శేషయ్య, కిరణ్, యాకసిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర


