కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళా సంఘాల ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచే దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో డీఆర్‌డీఏ, జిల్లా పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, జిల్లా సమాచార శాఖ తదితర అధికారులతో సమావేశమై జీవనోపాధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు లభిస్తున్న ఆర్డర్లు, అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుకు అవసరమైన నిధులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
మరిన్ని ఆర్డర్లు తీసుకురండి..
అవసరానికి అనుగుణంగా రూ.5లక్షల లోపు రివాల్వింగ్ ఫండ్ ప్రతిపాదనలు సమర్పించాలని, అనంతరం రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు. లేపాక్షి, ఇతర ఈ–కామర్స్ ఆన్‌లైన్ వంటి సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ మహిళా సంఘా ల ఉత్పత్తులకు మరిన్ని ఆర్డర్లు తీసుకురావాలన్నారు. విజయవాడలో మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక షోరూమ్ ఏర్పాటు అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. గొర్రెల యూనిట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు త్వరితగతిన యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు.
ఈ–మార్కెటింగ్‌పై దృష్టి..
గ్రీన్ కై ్లమేట్ ఫండ్ (జీసీఎఫ్) కార్యక్రమాల పురోగతి, ఇంపాక్ట్ స్టడీ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఈ–మార్కెటింగ్, మహిళలకు సోషల్ మీడియా మార్కెటింగ్‌పై విజయవాడలో ప్రత్యేక శిక్షణ కల్పించే అంశాలపై కూడా సమీక్షించి, కార్యాచరణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పశుసంవర్ధకశాఖ అధికారి ఎం. శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఉద్యానశాఖ అధికారి జె. జ్యోతి, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు, ఏడీఐఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు.


