మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 16 నుంచి ఫైనల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకులు పొందిన వారు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 20లోగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు, చేర్పులకు ఈ నెల 21వ తేదీ అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 24వ తేదిన సీట్ ఎలాట్‌మెంట్ ప్రకటిస్తామని, 25 నుంచి 29లోగా అభ్యర్థులకు కేటాయించిన కళాశాలకు స్వయంగా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా వివరించారు.
విజయవాడలీగల్: డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గన్నవరం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి సునీల్‌కుమార్ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.
విజయవాడ లీగల్: మద్యం రవాణా కేసులో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజ్‌శేఖర్‌రెడ్డి, కారుమూరి సునీల్ ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటీ వారెంటు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారిని ఈనెల 20 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య న్యాయస్థానంలో హాజరుపరచాలని చంచల్‌గూడా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేశారు.
కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడు పట్టణంలోని విజయలక్ష్మీ థియేటర్ వెనుక రోడ్డులో పిప్పళ్ల దుర్గామాణిక్య వరలక్ష్మీ భవాని (48), శ్రీరామచంద్రమూర్తి కుటుంబం నివాసం ఉంటుంది. ఈనెల 13న రాత్రి దుర్గా మాణిక్య వరలక్ష్మి భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. అయితే తన సోదరి మృతికి కారణాలు తెలుసుకోవాలంటూ మృతురాలి సోదరుడు మద్దూరి వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.


