సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫలాల్యలను ప్రశ్నించిన ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం వంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటీషన్‌పై వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్‌ను కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచారణ దశలో ఉన్న కస్టడీ పిటీషన్‌లో బలం లేదని ఉపసంహరించుకోవడం తన న్యాయవాద వృత్తిలో తొలిసారి చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ వ్యక్తిని సంతృప్తి పరిచేందుకు రావణ్‌పై రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. ఇది న్యాయ సమ్మతం కాదనే ఉద్దేశంతో రావణ్‌కు మద్దతుగా వాదించేందుకు ముందుకువచ్చినట్లు చెప్పారు. నిజంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా రావణ్ వ్యాఖ్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్‌ఐఏ వంటి కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల భద్రత కోసమే ఈ అక్రమ కేసులు పెట్టినట్లుగా ఉందన్నారు. హిట్లర్ మాదిరిగానే కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందన్నారు. ఇదే పంథా కొనసాగితే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ ఉండదన్నారు. ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించిన, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన రావణ్‌కు పట్టిన గతే పడుతుందని కూటమి పాలకులు సాంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికై న ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలని కోరారు. హిడ్మా మృతిపై చేసిన వ్యాఖ్యలకు రావణ్‌ను ఉరితీసేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే ఉపా కేసులను యూట్యూబర్ రావణ్‌పై నమోదు చేయడమంటే ఇంత కంటే దుర్మార్గం రాష్ట్రంలో మరోకటి ఉండదని మరో సీనియర్ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గతంలో కూడా భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందన్నారు. న్యాయవాదులు తిరివీధి వెంకయ్య, టి. కట్రావు తదితరులు పాల్గొన్నారు.


