కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం మండల విద్యాశాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు యూనిఫాంతో పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరును ప్రతి రోజూ క్రమం తప్పకుండా నమోదు చేసి పర్యవేక్షించాలన్నారు. ప్రతి రోజూ కనీసం 20 నిమిషాల పాటు యోగా నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరిగి ఫలితాలు మరింత మెరుగుపడతాయన్నారు. మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలో నిరంతరం సందర్శిస్తూ హాజరు, క్రమశిక్షణ విద్యాప్రమాణాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
యోగా ఆడియో, వీడియో ఆవిష్కరణ
జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ప్రార్ధనా సమావేశం సందర్భంగా విద్యార్థులతో యోగా సాధన నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. యోగా ఆడియో, వీడియోలను సమావేశంలో ఆయన ఆవిష్కరించారు.


