సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారం

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

సమస్యలకు సత్వర పరిష్కారం ● బంటుమిల్లికి చెందిన ఓ వృద్ధుడు ఎస్పీని కలిసి తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఇద్దరికీ సమానంగా ఆస్తి పంచినట్లు చెప్పాడు. ఇటీవల తన భార్య అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కుమారులను సహాయం అడిగితే సహాయం చేయకపోగా తాము ఉంటున్న ఇంటిని సైతం ఆక్రమించి తమను రోడ్డున పడేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ● కంకిపాడు నుంచి దిలీప్‌ అనే వ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం తమ దగ్గర బంధువుల నుంచి కొంత నగదు అప్పుగా తీసుకున్నట్లు చెప్పాడు. తీసుకున్న అప్పును ఒప్పందం ప్రకారం రెండు నెలల ముందే పూర్తిగా చెల్లించినట్లు తెలిపాడు. అయితే అప్పు ఇచ్చిన బంధువు చెల్లించిన నగదు తీసుకుని తనకు ఇవ్వలేదని దుర్భాషలాడుతూ తనను తన కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడంటూ వాపోయాడు. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. ● కృత్తివెన్ను నుంచి సుమ అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతుందని, అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. అడిగినంత కట్నం తీసుకురాని పక్షంలో తన భర్తకు మరొక వివాహం చేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయింది. విచారణ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. ● చల్లపల్లి నుంచి వెంకయ్య అనే వ్యక్తి వచ్చి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి నీరు రాకుండా చేయడమే కాక అడిగినందుకు తనపై దాడికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ మొరపెట్టుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని అర్జీ సమర్పించాడు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. ఇంకొన్ని అర్జీలను సంబంధిత స్టేషన్‌ అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో అధికారులు, సిబ్బంది ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు మేమున్నాం అనే భరోసాను కల్పించాలన్నారు. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మీకోసంలో 50 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.

మీకోసంలో వచ్చిన ప్రధానమైన అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement