పాలు పొంగని ఇళ్లలో పాపాలు! | - | Sakshi
Sakshi News home page

పాలు పొంగని ఇళ్లలో పాపాలు!

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

పాలు పొంగని ఇళ్లలో పాపాలు!

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఖాళీ ఫ్లాట్లు జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలో నిరుపయోగంగా ఇళ్లు కేటాయింపుల కోసం 350 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు కేటాయించక ముందే నామరూపాలు కోల్పోతున్న ఫ్లాట్లు

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): పాలు పొంగించి పిల్లా పాపలతో కళకళలాడాల్సిన లోగిళ్లు అవి...అధికారుల అలసత్వమో... పాలకుల వైఫల్యమో కానీ పేదలకు కేటాయింపులు జరగాల్సిన ఫ్లాట్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. నగరంలోని కాల్వ గట్టు, రోడ్డు విస్తరణల సమయంలోనూ, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న పేదల ఇళ్లు తొలగించి వారికి జక్కంపూడి కాలనీలో ఫ్లాట్లు కేటాయింపులు జరిగేవి. అయితే కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌, ప్రాథమిక పాఠశాల సమీపంలో బ్లాక్‌ నంబరు 252 నుంచి 263 వరకు ఎటువంటి కేటాయింపులు జరగలేదు. దీంతో సుమారు 350 కుటుంబాలకు దక్కాల్సిన ఫ్లాట్లు నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. చీకటి పడితే చాలు కాలనీలోని యువకులు మద్యం తాగేందుకు పేకాట ఆడేందుకు ఈ ఖాళీ బ్లాకులను ఆవాసాలుగా ఎంచుకుంటున్నారు.

చోరీకి గురవుతున్న తలుపులు, కిటికీలు

మొత్తం 11 బ్లాకుల్లో సుమారు 350 ఫ్లాట్‌లను నగర పాలక సంస్థ పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, ఆ తర్వాత పేదల కష్టాలను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫ్లాట్ల కేటాయింపుల ఊసే లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో సిద్ధమైన ఫ్లాట్లలో నేడు ధ్వంసమైన తలుపులు, కిటికీలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫ్లాట్లకు ఉండాల్సిన తలుపులు, కిటికీలను దొంగలు ఎత్తుకుపోయారు. ఇక బ్లాక్‌లో ప్రతి ఇంటికీ వేసిన డ్రైనేజీ పైపులు, ప్లాస్టిక్‌ పంపులు సైతం మాయం అయ్యాయి.

ఆ 11 బ్లాకులు వారికి అడ్డాగా మారాయి

రాత్రి వేళ పూర్తి స్థాయిలో మందుబాబులకు తోడు గంజాయి తాగే వారికి ఆ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటితో నిర్మానుష్యంగా ఉండే ఖాళీ ఫ్లాట్ల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా కొత్తపేట పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నా.. ముందుగానే సమాచారం రావడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు అక్కడి నుంచి జారుకుంటున్నారు. 11 బ్లాకులలో ఏ బ్లాక్‌లో చూసినా మద్యం సీసాలు, పగలగొట్టిన గాజుముక్కలు, పేకాట ముక్కలు, సగం తిని వదిలేసిన బిరియానీ ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి.

వెంటనే కేటాయింపులు జరగాలి...

కాలనీకి ప్రధాన సమస్యగా ఉన్న ఈ ఫ్లాట్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయింపులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫ్లాట్లను ఇలాగే వదిలేస్తే మరి కొన్నేళ్ల తర్వాత లబ్ధిదారులకు కేటాయింపులు జరిగినా వారు ఉండేందుకు అనువుగా ఉండవని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement