బంటుమిల్లి: చంద్రబాబు ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రమేష్(రాము) ఆరోపించారు. బంటుమిల్లి ప్రధాన కాలువకు నీటి విడుదలపై పాలకులు, నీటీపారుదల శాఖ అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయం వద్ద బంటుమిల్లి ప్రధాన కాలువలో నీటి పారుదల రీడింగ్ పరిశీలించిన అనంతరం రాము విలేకరులతో మాట్లాడుతూ బంటుమిల్లి ప్రధాన కాలువకు దాదాపు 900 క్యుసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 300 క్యుసెక్కుల నీరు ఇచ్చారని.. ఇది ఏ రైతు పంటను కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగు నీరు అందక వెద చల్లిన పొలాలు ఎండిపోతు రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ తీర ప్రాంత భూముల్లో వరి తప్ప ఏది పండని చోట రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు, జె. భూపతిరాజు, ఎంపీపీలు కె. గరుడప్రసాదు, ఎస్. మధుసూదన్‌రావు, వైస్ ఎంపీపీ ఓ. చిన్నారిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కె. గంగాధర్, జెడ్పీటీసీ ఎం. రత్నకుమారి, ఎంపీటీసీలు పి. వీరబాబు, ఎండి. కమాల్‌బాషా, ఎండీ. ఆలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
స్థానిక లక్ష్మీపురం సెంటర్లో బంటుమిల్లి ప్రధాన కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా, మండల కన్వీనర్లు జి. నాగేశ్వరరావు, ఎల్. అజయ్‌కుమార్, సీపీఎం మండల పార్టీ కన్వీనరు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ
ఆధ్వర్యంలో నిరసన


