ఊటుకూరులో ప్రారంభోత్సవాల శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు ముద్రించని నిర్వాహకులు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల నడుమ మళ్లీ రాజుకున్న వివాదం ఇరువురు ప్రజాప్రతినిధుల గైర్హాజరు ఎమ్మెల్యేపై పరుష పదజాలంతో మాట్లాడిన సీనియర్ నాయకుడు చెరుకూరి
తిరువూరు/గంపలగూడెం: గంపలగూడెం మండలం ఊటుకూరు కృష్ణదేవరాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు లేదంటూ ఆయన వర్గం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడం వివాదానికి దారి తీసింది. సహకార సంఘంలో ఆధునికీకరించిన కల్యాణమంటపం, ఆర్వో ప్లాంటు ప్రారంభోత్సవం, గ్రామ ప్రముఖుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్‌లను నిర్వాహకులు ఆహ్వానించారు. శిలాఫలకంపై వారి పేర్లు మాత్రమే ముద్రించారు. స్థానిక శాసనసభ్యుడైన కొలికపూడి శ్రీనివాసరావును ఆహ్వానించకపోగా, ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు కూడా ముద్రించకుండా దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ ఆయన వర్గీయులు సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేదు.
ఎమ్మెల్యేపై ధ్వజం
ఇదిలావుండగా సహకార సంఘ చైర్మన్ చెరుకూరి రాజేశ్వరరావు కల్యాణ మంటపం ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. గ్రామ, మండల కమిటీలు నియమించడంలో ఎమ్మెల్యే ప్రమేయం ఏమిటని, సిన్సియర్ కార్యకర్తలను అణగదొక్కి తన అడుగులకు మడుగులొత్తే వారితో కమిటీలు వేయాలని ఎమ్మెల్యే యత్నించడంతో తామంతా వ్యతిరేకించామన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించేటపుడు పార్టీ పదవుల్లో ఉన్న నాయకులకు కనీస మర్యాద ఇవ్వరని, వారికి సమాచారం ఇవ్వకపోవడం గర్హనీయమని అన్నారు. ఎదుటివారిని గౌరవించని ఎమ్మెల్యేని ఎవరూ గౌరవించరని, ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదని, కార్యకర్తలే నిర్వహించారన్నారు. తమకు పార్టీయే ముఖ్యమని, పార్టీ ఆదేశానుసారం నడచుకుంటామని చెరుకూరి అనడం గమనార్హం.


