పామర్రు: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే మహిళ దుర్మరణం పాలైన ఘటన పామర్రు మండలం అడ్డాడ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. పామర్రు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డాడ గ్రామానికి చెందిన బొచిన కుమారి(25) తన కుమార్తె బొచిన వీరమ్మ, బంధువు మాదాసు సుబ్బమ్మతో కలిసి దగ్గరలో ఉన్న పెదమద్దాలి శివారు ప్రాంతమైన కొండాయపాలెం వెళ్లి తమ ప్లాస్టిక్ సామాన్లను అమ్ముకున్నారు. అనంతరం అక్కడి నుంచి పామర్రు–గుడివాడ ఎన్‌హెచ్ –165లో రోడ్డుకు ఎడమ వైపుగా కాలినడకన ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో అడ్డాడ అరవింద స్కూల్ వద్దకు చేరుకోగానే అవనిగడ్డ డిపోకు చెందిన అవనిగడ్డ–గుడివాడ ఆర్టీసీ బస్సు వెనుకగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొచిన కుమారి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమార్తె బొచిన వీరమ్మకు గాయాలయ్యాయి. పామర్రు పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని వీరమ్మను 108లో గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. బసుఐస డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పామర్రు ఎస్‌ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.


