భాషాసంస్కృతులను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భాషాసంస్కృతులను కాపాడుకోవాలి

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

భాషాసంస్కృతులను కాపాడుకోవాలి ● ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ ● ముగిసిన మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు

ఆకట్టుకున్న కళారూపాలు..

మహాసభల సందర్భంగా ప్రధాన వేదికపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన వివిధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. కూచిపూడి, ఆంధ్రనాట్యం, పద్యాలాపన, సాహితీరూపకం ఇలా వివిధ కళాంశాలలో కళాకారులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్‌ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తెలుగునాట మహిళా రచయిత్రులు అందించిన సాహితీసేవలు అపూర్వమన్నారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభలు ఆద్యంతం తెలుగు సాహితీవైభవానికి అండగా నిలిచాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్మన్‌ బోడుపాటి తేజస్విని మాట్లాడుతూ.. దేశంలో తెలుగు సంస్కృతికి ప్రత్యేకమైన స్థానముందన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్‌.రజని మాట్లాడుతూ.. తెలుగు రచయిత్రుల విశిష్టతను వివరించారు. మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్‌, కార్యనిర్వాహక గౌరవాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శి మహిళలేనన్నారు. సమాజానికి తమ సాహిత్యం ద్వారా సేవలందించిన ప్రఖ్యాత రచయిత్రుల సేవలను వివరించి వారిని కొనియాడారు.

అనుచితంగా మాట్లాడితే..

రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్‌ జీవీ పూర్ణచంద్‌ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఆమోదింపజేశారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించటం, మాట్లాడటం చేసిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని, సోషల్‌మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని సూచించారు.

సామాజిక చైతన్యానికి పాటుపడాలి..

సామాజిక చైతన్యానికి రచయిత్రుల పాటుపడాలని పలువురు ప్రముఖ రచయిత్రులు పేర్కొన్నారు. తెలుగు పరిశోధనా రంగం, విద్యారంగం, సాంస్కృతికరంగం, తెలుగు భాషోద్యమం, రాష్ట్రేతరుల సమావేశం ఇలా పలు సదస్సులు వేరువేరు వేదికలపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు విభాగ ఆచార్యురాలు డాక్టర్‌ దేవులపల్లి పద్మజ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తెలుగు విభాగ ఆచార్యులు ఆచార్య వంగరి త్రివేణి, పలువురు సాహితీ వేత్తలు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement