నిద్రలేమి.. నిశ్శబ్ద మహమ్మారి | - | Sakshi
Sakshi News home page

నిద్రలేమి.. నిశ్శబ్ద మహమ్మారి

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

ప్రధాన సమస్యగా స్లీప్‌ ఆప్నియా నగరంలో పెరిగిన నైట్‌ కల్చర్‌ నిద్రలేమితో మానసిక, శారీరక సమస్యలు

గాంధీనగర్‌కు చెందిన రమేష్‌(40) ప్రభుత్వ ఉద్యోగి. కొద్దిగా ఒబెసిటీ ఉంది. దీంతో నిద్రలో అతిగా గురక వస్తుంటుంది. దీంతో శ్వాస సమస్య తలెత్తి తరచూ మెలకువ వస్తుంది. ఇటీవల డ్యూటీకి వెళితే పనిపై దృష్టి పెట్టలేక పోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.

లబ్బీపేటకు చెందిన వ్యాపారి అర్ధరాత్రి వరకూ బయటే గడుపుతాడు. తర్వాత వెళ్లి రోజుకు మూడు, నాలుగు గంటలు నిద్రపోతుంటారు. దీంతో ఇటీవల బైక్‌ నడుపుతుంటే అదుపు తప్పడం, కోపం చిరాకు పెరిగింది. అందుకు నిద్రలేమి కారణం అని వైద్యులు తేల్చారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు నిద్ర అనేది రోజువారీ జీవితంలో సహజమైన విశ్రాంతి. ఇప్పుడు అదే నిద్ర చాలా మందికి అందని వరంగా మారుతోంది. పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు కొనసాగే నైట్‌ కల్చర్‌, స్మార్ట్‌ఫోన్‌ల వ్యసనం, మారుతున్న జీవనశైలి.. ఇవన్నీ కలిసి నగరవాసుల నిద్రను దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి నిశ్శబ్దంగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం నగరంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు సరిపడా నిద్రపోవడం లేదు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావించినా, దీని ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై పడుతోంది. అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది.

తీవ్రమైన రుగ్మత స్లీప్‌ ఆప్నియా

నిద్రలో పదే పదే శ్వాస ఆగిపోవడం, మళ్లీ ప్రారంభం కావడం జరిగే ఒక తీవ్రమైన నిద్ర రుగ్మత స్లీప్‌ ఆప్నియా. ఇది ఉన్న వారికి నిద్రలో శరీరానికి తగినంత గాలి అందదు. గుండెపోటు, మెదడుపోటు వంటి ప్రాణాంతక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. స్లీప్‌ ఆప్నియాకు ఊబకాయం, పెద్ద టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌, ధూమపానం, మద్యం వాడకం, కొన్ని రకాల మందులు, నార్కోలెప్సి వంటి నిద్ర రుగ్మతలు ప్రధాన కారణంగా చెపుతున్నారు. ఇలాంటి వారు బిగ్గరగా గురక వేయడం, నిద్రలో గాలికోసం గ్యాస్పింగ్‌, ఎండిపోయిన నోరుతో నిద్ర మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగలు అధిక నిద్ర, డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

స్లీప్‌ స్టడీ

ఇలాంటి వారి కోసం స్లీప్‌స్టడీ అందుబాటులోకి వచ్చింది. ఇంటికే వచ్చి స్లీప్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. వారు ఏ రకమైన నిద్రలేమితో బాధపడుతున్నారో నిర్ధారిస్తారు. నిద్రలో మెదడుకు ఆక్సిజన్‌ ఎలా అందుతుంది. హార్ట్‌ బీట్‌ ఎలా ఉంది అనే అంశాలను గమనిస్తారు.

నైట్‌కల్చర్‌తో..

నగరంలో నైట్‌ కల్చర్‌ పెరిగిపోయింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడిపే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఇళ్లలో ఉన్న వారు కూడా అర్ధరాత్రి దాటే వరకూ స్మార్ట్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో అనేక మంది నిద్రలేమి సమస్య వెంటాడుతున్నాయి. తమకు ఆ సమస్యలు నిద్రలేమితో వస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనించలేక పోతున్నారు. దీంతో తీవ్రమైన వత్తిడి కారణంగా మధుమేహం, అదిక రక్తపోటుతో పాటు డిప్రెషన్‌ వంటి సమస్యల బారిన పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement