‘ఎదురుమొండి’పై ఎందుకింత కక్ష | - | Sakshi
Sakshi News home page

‘ఎదురుమొండి’పై ఎందుకింత కక్ష

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

‘ఎదురుమొండి’పై ఎందుకింత కక్ష

గత ప్రభుత్వంలో నిధులు మంజూరు వారధి నిర్మించి మీ పేరు పెట్టుకోండి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా అధ్యక్షుడు పేర్ని నాని

అవనిగడ్డ/నాగాయలంక: ఎదురుమొండి దీవుల ప్రజలపై కూటమి ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్‌ చేశారు. ఎదురుమొండి వారధి నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు శనివారం అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పది కిలోమీటర్ల మేర నిరసన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నాగాయలంక సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి పేర్ని మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి ఎదురుమొండి వారధిని మంజూరు చేయించారని చెప్పారు. అంచనాలు పూర్తి చేసి, టెండర్లు పిలిచారని ఎన్నికలు దగ్గర పడటంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అమరావతిలో అర్హత ఉన్నా లేకపోయినా వందల కోట్లు టెండర్లు అప్పచెబుతున్నారు కదా, బ్రిడ్జిలు కడుతుంటే కూలిపోతున్నా మళ్లీ వాళ్లకే టెండర్లు ఇస్తున్నారు కదా, అలాగే ఎదురుమొండి వారధి కోసం మీ కిష్టమైన కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని వారధి నిర్మించేలా చూడాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ ప్రజలకు వంతెన వస్తుందని ఆశ పడ్డారని మీరే వంతెన కట్టి మీకు నచ్చిన వాళ్ల పేర్లు పెట్టుకోండి మాకెలాంటి అభ్యంతరం లేదని పేర్ని అన్నారు.

వాళ్ల ఓట్లు కావాలి.. ట్యాక్స్‌లు కావాలి

ఎదురుమొండి దీవుల ప్రజల ఓట్లు కావాలి, ట్యాక్స్‌లు కావాలి కానీ వారధి కోసం నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేయడం లేదని పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైనా మేమే.. కింద మేమే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటున్నారుకదా గత ప్రభుత్వంలో రూ.109 కోట్లు నిధులు మంజూరైనా వంతెన నిర్మాణం చేపట్టడానికి ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. టెండర్లు పిలిపించి నిర్మాణ పనులు చేయాలని వైఎస్సార్‌ సీపీ తరఫున ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో చంద్రబాబు ఇక్కడున్న భూములకు చుక్కలు పెట్టి 22ఏ జాబితాలో చేర్చితే జగన్‌మోహన్‌రెడ్డి వాటిని విముక్తి చేశారని పేర్ని నాని గుర్తు చేశారు. కూటమి వచ్చాక మళ్లీ చుక్కపెట్టి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, ఇదేనా మీరు రైతులకు చేసిన మేలు అని పేర్ని నాని ప్రశ్నించారు.

కక్ష సాధింపు..

మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ ఎదురుమొండి వారధి గురించి మాట్లాడుతుంటే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదనే దురుద్దేశంతో వారధి నిర్మించకుండా కక్షసాధింపునకు పాల్పడుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు అందరికంటే పనితీరులో చివర ఉన్న బుద్ధప్రసాద్‌ నైరాశ్యంతో ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు భోగాది శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింహాద్రి వికాస్‌, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల జెడ్పీటీసీలు సీహెచ్‌ లక్ష్మీనారాయణ, ఆర్‌.కళ్యాణి, కె.మురళి, అవనిగడ్డ ఎంపీపీ టి. సుమతీదేవి, ఎదురుమొండి దీవులకు చెందిన మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వరరావు, సుబ్బారావు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement