చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు, ప్రతి పొలానికి కావాల్సినంత యూరియా అందించే బాధ్యత తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో యూరియా లభ్యత, సరఫరాపై శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దన్నారు. గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి జిల్లాలో 4,732 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేశారని, ఈ ఏడాది 10,088 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 54,805 మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారన్నారు. జిల్లాలో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు మించి ముందుగానే కొనుగోలు చేయకుండా అందరికీ సమానంగా యూరియా అందేలా తాము చర్యలు చేపట్టామన్నారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫెర్టిలైజర్ సప్‌లై యాప్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఈ యాప్ అమలుకు రాష్ట్రంలో కృష్ణా, కాకినాడ జిల్లాలను పైలెట్ జిల్లాలుగా ఏర్పాటు చేశారని, ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా వాటిని ప్రభుత్వంతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రస్తుతం యూరియా సరఫరా ప్రక్రియ సజావుగా సాగుతోందని, అప్పుడప్పుడు స్వల్పంగా సర్వర్ సమస్య మినహా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రత్యేక సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్‌లు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల తరఫున విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు యాప్‌లో బుక్ చేసే ఏర్పాట్లు చేశామన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోవటం లేదా నిరక్షరాస్యత కారణంగా ఏ రైతు అయినా యూరియా అందక ఇబ్బంది పడిన ఘటనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి, మార్క్‌ఫెడ్ డీఎం మురళీకిషోర్, అగ్రికల్చర్ ఆఫీసర్ శాంతి పాల్గొన్నారు.


