సాక్షి, విజయవాడ : విజయవాడ కోర్టులో మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, రెండవ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. 15 మంది న్యాయమూర్తుల ఆధ్వర్యంలో 15 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 437 సివిల్ కేసులు, 29 ప్రీ లిటిగేషన్ కేసులు, 26,339 క్రిమినల్ కేసులు, మొత్తం 26,805 కేసులను పరిష్కరించినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి సునీల్ నాయక్ తెలిపారు.
11 ఏళ్ల నాటి కేసుకు మోక్షం
నందిగామ టౌన్: పదకొండేళ్లుగా పరిష్కారానికి నోచుకోని పార్టీషన్ దావా కేసును జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించినట్లు 16వ అదనపు జిల్లా న్యాయమూర్తి పగడాల శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని కోర్టు సముదాయం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గుంజా శ్రీనివాసరావు తన తండ్రి మరణానంతరం 2015లో జిల్లా కోర్టులో పార్టీషన్ దావా దాఖలు చేశారన్నారు. రూ.ఐదు కోట్ల విలువ చేసే ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లుకు సంబంధించిన దావాను నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని విలువైన సమయాన్ని ఆదా చేసుకోవాలని చెప్పారు. కక్షిదారులకు లోక్ అదాలత్‌పై అవగాహన కలిగించి ఏళ్ల తరబడి సాగుతున్న కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా కృషి చేసిన సీనియర్ న్యాయవాది ఈశ్వరప్రగడ రంగారావును ఆయన అభినందించారు.
431 కేసులు.. రూ. 9.24 కోట్లు..
నందిగామలోని 16వ అదనపు జిల్లా జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల పరిధిలోని 431 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి రూ.9,24,55,107ను కక్షిదారులకు అందించినట్లు న్యాయమూర్తి శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు జరిమానాలు విధించిన 11 వేల కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వనపల్లి సత్యలక్ష్మీప్రసన్న, షేక్ రియాజ్, వందన, న్యాయవాదులు మన్నెం నారాయణరావు, మట్టా ప్రసాద్, అద్దంకి మణిబాబు, ఆనందం విజయభాస్కర్, చిరుమామిళ్ల కిరణ్, మంగయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.


