రూ.6.53 కోట్ల బకాయిలు తప్పించుకునేందుకే ఆరోపణలు ఏటా కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు ఎన్నికల ముందు ఇదే తంతు ఆధారాలుంటే నిరూపించాలి: ఎండీ, బోర్డు సభ్యులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెల్లించాల్సిన రూ. 6.53 కోట్ల బకాయిని చెల్లించకుండా తప్పించుకునేందుకే కొందరు వ్యక్తులు యూనియన్‌లో అవినీతి, అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసే ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలని విజయ డెయిరీ ఎండీ, డైరెక్టర్లు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిపాలనా భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు వేమూరి సాయి, ఆర్జా నాగిరెడ్డి, దాసరి బాలవర్థనరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ కొల్లి ఈశ్వరబాబు మాట్లాడుతూ వీరవల్లి ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. యూనియన్ అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఏటా ఆగస్టులో జరిగే బోర్డు డైరెక్టర్ల ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరవల్లి ప్లాంట్ నిర్మాణం, భూముల కొనుగోలు, వెన్న, పాలపొడి కొనుగోళ్లు, ఇతర ఆర్థ్ధిక లావాదేవీలన్ని సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం పొందిన తర్వాత చేసినవేనని స్పష్టం చేశారు. వీరవల్లి ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించామని,, దీని ద్వారా లీటర్‌కు రూ.1.20పై మేర ఖర్చు తగ్గుతుందన్నారు. రూ.185 కోట్ల అంచనాలతో ప్లాంటు పనులను ప్రారంభించి, రూ.183కోట్లతోనే పూర్తిచేశామని వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మించిన వీరవల్లి ప్లాంట్ బుడమేరు వరద సమయంలో 42 రోజులపాటు విశేషంగా సేవలు అందించి యూనియన్‌ను నిలబెట్టిందన్నారు. యూనియన్ టర్నోవర్ గతంలో రూ.700 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1300 కోట్లకు పెరిగిందని వివరించారు.
శివరాం రూ.6.53 కోట్లు బకాయి...
యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి మాట్లాడుతూ యూనియన్‌పై అనేక తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ తోట్లవల్లూరు మండల అధ్యక్షుడు వీరపనేని శివరాం విజయ డెయిరీ సంస్థకు రూ. 6.53 కోట్లు బకాయి ఉన్నారన్నారు. 1.50 లక్షల పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిందన్నారు. సంస్థకు బకాయి ఉన్న వ్యక్తి బోర్డు డైరెక్టర్ల ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారి అతని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సైతం కోర్టు సమర్థించిందన్నారు. ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉండటంతో యూనియన్‌ను అస్థిరపరచడానికి, బకాయిలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నింలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బోర్డు డైరెక్టర్లు, సభ్యులు నిర్ణయించినట్లు వివరించారు.


