జి.కొండూరు: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్లటూరులో గురువారం రాత్రి జరిగింది. వివరాలలోకి వెళ్తే...ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన నల్లమోతు రమేష్(23) రాడ్‌బెండింగ్ పనులు చేస్తూ ఉంటాడు. గురువారం రాత్రి 9గంటల సమయంలో పనినుంచి ఇంటికి వచ్చిన రమేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై రమేష్ తనబెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. తండ్రి లాజర్ కొద్దిసేపటికి రమేష్‌ను అన్నం తినమని పిలిచేందుకు గదిలోకి వెళ్లగా అతను ఉరేసుకున్న విషయాన్ని గమనించాడు. దీంతో రమేష్‌ను చికిత్సనిమిత్తం హుటాహుటిన ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి తండ్రి లాజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గన్నవరం: యూట్యూబర్ రావణ్‌ను కస్టడీ కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ ల 14కి వాయిదా వేసింది. నిషేధిత సీపీఐ మావోయిస్టు సంస్థకు మద్దతుగా వీడియో చేశారనే అభియోగంపై రావణ్‌పై గన్నవరం పోలీసులు దేశద్రోహం వంటి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న రావణ్‌ను పదిరోజులు కస్టడీ కోరుతూ స్థానిక అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు రాకపోవడంతో ఏపీపీ మాధవి విచారణను వాయిదా కోరగా, జడ్జి సమ్మతించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్):గంజాయితోపాటు వివిధ కేసులలో నిందితుడిగా ఉన్న బత్తుల చిన్నబ్బాయిని పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద భవానీపురం పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జక్కం పూడి వైఎస్సార్ కాలనీకి చెందిన అతనిపై భవానీపురంతోపాటు వివిధ స్టేషన్లలో గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏడాదిపాటు జైలు జీవితం గడుపుతాడని పోలీసులు వివరించారు.
పామర్రు: ఇంటర్ చదివే బాలికను ప్రేమించమని వెంటబడి వేధించిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. పోలీసుల కథనం మేరకు..మొవ్వ మండలం పెడసనగ్లు గ్రామానికి చెందిన పేరం గోపిరాజు అనే యువకుడు రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను ప్రేమపేరుతో వేధించడంతో కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌ఐ సురేష్ విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.వెంకటేశ్వర్లు, నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష , రూ. వెయ్యి జరిమానా విధించారు. ఏఎస్‌ఐ జేబీ చలపతిరావు సాక్షులను కోర్టులో హాజరుపర్చగా, ప్రాసిక్యూషన్ తరపున పీపీ మాదివాడు వెంకట నరసింహారావు వాదనలు వినిపించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీకి చెందిన నాయకుడు విజయవాడ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉపా చట్టంపై, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యాలు చేశారని, టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరిచారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడతామని వన్‌టౌన్ స్టేషన్ అధికారులు తెలిపారు.


