31.5 కేజీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈగల్ టీమ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ)గురువారం రాత్రి సంయుక్త తనిఖీలు నిర్వహించి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 31.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో ఓ మైనర్ ఉన్నాడు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జేవీ రమణ కథనం మేరకు..అనకాపల్లి జిల్లా వి.శరబరం గ్రామానికి చెందిన దోసపత్ని రాజు ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని బెంగళూరులోని జోకీ అనే వ్యక్తికి అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఒడిశా రాష్ట్రంలోని జనతాబాయి గ్రామంలో గుర్తుతెలియని గిరిజనుల నుంచి గంజాయి కొనుగోలు చేసి అన్నవరం తీసుకువచ్చి పొదల్లో దాచిపెట్టాడు. ఈ గంజాయిని బెంగళూరు తరలించేందుకు కర్నూలు జిల్లాలోని ఓసూరు గ్రామానికి చెందిన జోకిం బాలసవారి డిసౌజా, తిరుపతికి చెందిన కోటకొండ ధనరాజుతోపాటు ఒక మైనర్ బాలుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దోసపత్ని రాజు సూచన మేరకు వీరు ముగ్గురు ఒక్కొక్కటి 1.5కేజీల బరువుగల 21 ప్యాకెట్ల గంజాయిని నాలుగు బ్యాగుల్లో సర్దుకుని ఈనెల 9వతేదీ మధ్యాహ్నం అన్నవరంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కోచ్‌లో ఎక్కారు. రైలు రాత్రికి విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐదోనంబర్ ప్లాట్‌ఫాంపై చేరుకోగా ఈగల్ టీం, జీఆర్‌పీ బృందాలు తనిఖీ చేపట్టి, అనుమానస్పదంగా ఉన్న వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులు సోదా చేసింది. వారి వద్ద నుంచి రూ. 63వేల విలువగల 31.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతోపాటు వారి సమాచారం మేరకు గంజాయి రవాణా సూత్రధారి దోసపత్ని రాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు.


