గడువులోగా ‘సర్‌’ పూర్తికి పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా ‘సర్‌’ పూర్తికి పార్టీలు సహకరించాలి

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

గడువులోగా ‘సర్‌’ పూర్తికి పార్టీలు సహకరించాలి

చిలకలపూడి(మచిలీపట్నం): అర్హత ఉన్న ప్రతివ్యక్తికి ఓటుహక్కు ఉండేలా రాజకీయ పార్టీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌)పై శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీతోపాటు తిరిగి సేకరించడం కూడా అంతే ముఖ్యమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, తర్వాత రావాలని కోరడం, అపార్ట్‌మెంట్లలో ఒకేసారి ఫారాలు ఇవ్వాలని నిర్ణయించడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. ఈప్రక్రియలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు బీఎల్‌వోలకు సహకరించాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలను విభజించి కొత్త పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదించామన్నారు. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు నియోజకవర్గాల వారీగా కొత్త పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ను సంబంధిత అధికారులతో పరిశీలించి ఖరారు చేస్తామని వివరించారు. ఆర్డీవోలు కె.సాంబశివరావు, జి బాలసుబ్రమణ్యం, కరుణకుమారి, కెఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి. నీలకంటేశ్వరరెడ్డి, సమగ్రశిక్ష ఏపీసి ఆర్‌ కుముదినిసింగ్‌, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో

మాట్లాడుతున్న కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement