మూడు రోజులు శాకంబరీ ఉత్సవాలు
● ఘాట్ రోడ్డు మీదగానే
కొండపైకి అనుమతి
● 26వ తేదీన తెలంగాణ బంగారు బోనం
● 27వ తేదీ నుంచి శాకంబరి ఉత్సవాలు
● వెల్లడించిన ఆలయ చైర్మన్
రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిపై ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసోత్సవాలకు దసరా తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే ఆషాఢ మాసోత్సవాలు, తెలంగాణ బంగారు బోనం, శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సీవీ రెడ్డి చారిటీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో శాకంబరీ ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం చైర్మన్, ఈఓ మాట్లాడుతూ.. ఆషాఢ మాసోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని తెలిపారు. ఆషాఢం నెల రోజులూ దసరా తరహాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరినీ ఘాట్ రోడ్డు మీదగానే కొండపైకి అనుమతిస్తామన్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మహా మండపం ఆరో అంత స్తులో ఉత్సవమూర్తిని దర్శించుకుని సారె సమర్పించి, మొదటి, రెండో అంతస్తుల్లో ఉచిత అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత గోశాల, కనకదుర్గనగర్ మీదుగా కొండ కిందకు చేరుకుంటారని వివరించారు. చైనా వాల్, దుర్గాఘాట్ నుంచి వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, దివ్యాంగుల కోసం దేవస్థానం ఉచితంగా బస్సులను నడుపుతుందన్నారు. కనకదుర్గనగర్‌లో ప్రత్యేకంగా చెప్పులు, క్లోక్‌రూమ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. 15వ తేదీ నుంచి ఆలయంలో వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులుగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పిస్తారని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. సుమారు 500 మంది కళాకారులు, భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని పేర్కొన్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. ఉత్సవాలలో తొలి రోజున హోల్‌సేల్ వ్యాపారులందరూ కలిసి అలంకరణకు అవసరమైన అన్ని కూరగాయలను విరాళంగా అందజేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రెండో రోజున ఆకుకూరలు, కూరగాయలతో, మూడో రోజు పండ్లు, ఫలాలు, కాయలు, డ్రైప్రూట్స్‌తో అమ్మవారిని అలంకరిస్తామని వివరించారు.
14 అంశాలతో ట్రస్ట్ బోర్డు సమావేశం
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన మంగళవారం సీవీ రెడ్డి చారిటీస్‌లో నిర్వహించారు. ఈఓ శీనానాయక్, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 14 అంశాలు చర్చగా రాగా 12 అంశాలను ఆమోదించారు. ఆషాఢ మాసోత్సవాలు, శాకంబరీ, తెలంగాణ బోనం ఏర్పాట్లపై చర్చ సాగింది. ఇటీవల ఆలయంలో జరిగే టికెట్లను అక్రమంగా తరలిస్తూ అవుట్ సోర్స్ సిబ్బంది పట్టుబడిన అంశంపైన సుదీర్ఘంగా చర్చ సాగింది.


