చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచా యతీ అభివృద్ధి అధికారుల సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘ ప్రధాన అధ్యక్షుడిగా జె.రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శిగా వి.ప్రకాష్‌నాథ్, కోశాధికారులుగా సీహెచ్.ఆంజనేయులు, కె.సురేష్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జె.హెచ్.వి.పవన్ కుమార్, సహాధ్యక్షులుగా బి.కోటయ్య, బి.మునిరాజు ఇతర కార్యవర్గ సభ్యులుగా బి.సునీత, పి.దయామణి, పి.శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా డీపీఓ కార్యాలయ ఏఓ పి.శివరామకృష్ణ, గుడివాడ డీపీఓ కార్యాలయ ఏఓ వి.సీతారామయ్య వ్యవహరించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసో సియేషన్ కార్యవర్గ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై చర్చించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ ఎల్.చంద్రకళ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతి, జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ డాక్టర్ పి.మురళి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఒకటి. ఈ నెల ఆరో తేదీన డివిజన్ 192 రైళ్ల నిర్వహణలో 97.35 శాతం సమయపాలన నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. గతంలో నమోదైన 97.24 శాతం రికార్డును అధిగమించింది. ఈ విజయం సమర్థవంతమైన రైలు కార్యకలాపాలపై డివిజన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం, చురుకై న పర్యవేక్షణ, ఉద్యోగుల అంకితభావంతో కూడిన కృషి ఫలితంగానే ఈ అద్భుతం సాధ్యమైందన్నారు.


