చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీ పరిపాలనలో రికార్డులను పకడ్బందీగా నిర్వహించి, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే క్రమశిక్షణాపరమైన ఇబ్బందులను నివారించగలమని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామపంచాయతీ పరిపాలనపై పంచాయతీ ప్రత్యేక అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
క్రమశిక్షణ చర్యలకు కారణమిదే..
గ్రామపంచాయతీల్లో నమోదవుతున్న అనేక క్రమశిక్షణా చర్యలకు ఉద్దేశపూర్వక తప్పిదాల కంటే అవగాహన లోపం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో లోపాలే ప్రధాన కారణామని కలెక్టర్ చెప్పారు. ప్రతి నిర్ణయానికి సంబంధించిన ఆధారాలు, రికార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. టెండర్ ద్వారా చేపట్టాల్సిన పనులను నామినేషన్ పద్ధతిలో అమలు చేసే ప్రయత్నాలు చేయరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పరిమితులు, టెండర్ విధానాలు, పరిపాలనా, సాంకేతిక అనుమతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరిపాలనా అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి, డీఎల్‌పీవోలు రజావుల్లా, రామానందం తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


