మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీరణ పనులకు ఆటంకం కలగకండా ఉండేందుకు బుధవారం నుంచి స్టేడియంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐజీఎంసీ స్టేడియంలో చేపట్టిన ఆధునికీకరణ పనులు, వివిధ అభివృద్ధి పనులు చేయడానికి ఏవిధమైన ఆటంకాలు, ఇబ్బంది క్రీడాకారులకు కలుగకుండా ఉండేందుకు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు స్టేడియంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వివరించారు. క్రీడాకారులు, ప్రజలు, వాకర్స్ అందరూ నగరంలోని ఇతర స్టేడియంలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా జూనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 9వ తేదీన జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ కృష్ణ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు ఎస్.ఎన్. సాయి శ్రీనివాస్, ఎస్. హరికృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోయే జూనియర్ మెన్ హాకీ చాంపియన్ షిప్–2026 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. 2007 జనవరి ఒకటో తేదీ, ఆ తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఎంపికలకు అర్హులన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్టు జూలై 11 నుంచి 14వ తేదీ వరకు గుంటూరు వేదికగా జరగబోయే రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ టోర్నమెంట్లో కృష్ణా జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.
జగ్గయ్యపేట: జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇండక్షన్ స్టౌవ్‌లు, వంట పాత్రలు పంపిణీ చేస్తామని జిల్లా శిశు సంక్షేమాధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పేర్కొన్నారు. మంగళవారం సాక్షి దిన పత్రిక ‘ఇండక్షన్ స్టౌవ్‌ల పంపిణీలో జాప్యం’ అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆమె జిల్లాలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో 1,475 కేంద్రాలున్నాయని, 1068 స్టౌవ్‌లు పంపిణీ చేయగా 407 కేంద్రాలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా పలు కేంద్రాలలో ఇండక్షన్ స్టౌవ్‌లపైనే వంట చేస్తున్నారని చిల్లకల్లు, నందిగామ ప్రాజెక్టులకు స్టౌవ్‌లు, వంట పాత్రలు పంపిణీ చేయాల్సి ఉందని రెండో విడతలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలోని భీమరాజుగుట్ట ప్రాంతంలో మంగళవారం జరిగింది. బీమరాజుగుట్ట ప్రాంతానికి చెందిన బి.రమేష్ కుమార్తె మౌనిక (17) తొమ్మిదో తరగతి వరకు చదివింది. ప్రస్తుతం చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులు కుటుంబ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో ఉరికి వేలాడుతూ కుమార్తె కనిపించడంతో కిందకు దించి హుటాహుటిన ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యశాలకు చేరిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విస్సన్నపేట: స్థానిక నూజివీడు రోడ్డులో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. చాట్రాయి మండలం చిత్తపూరుకు చెందిన చల్లపల్లి శృతి(28)తన అత్త జ్యోతితో కలిసి సోదరుడైన చరణ్ బైక్‌పై విస్సన్నపేట వైపు వస్తుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. శృతి తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, జ్యోతి నూజివీడు ఏరియా హస్పిటల్‌లో, చరణ్ విస్సన్నపేట సీహెచ్‌సీలో వైద్యం పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అర్జునరాజు తెలిపారు.


