వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా
కంకిపాడు: నూరుశాతం అక్షరాస్యత సాధనే ప్రభుత్వ లక్ష్యమని వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రంజిత్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా 20 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ అంశాలపై అవగాహన కలిగి ఉండేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఉల్లాస్ కార్యక్రమం కింద వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 100 గంటల పాటు అవసరమైన శిక్షణ అందించామన్నారు. 2029 నాటికి దశల వారీగా అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.బసవయ్య, పరీక్ష కేంద్రం పర్యవేక్షకురాలు యార్లగడ్డ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని రంజిత్‌బాషా సందర్శించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 73,327 మంది అభ్యాసకులకు 980 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసంచాలకులు ఎండీ.హాజీబేగ్, ఎంపీడీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): నూతన తెలుగు సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని ఏపీ ముదిరాజ్ మహాసభ రూపొందించిన ముదిరాజ్ –2026 డైరీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. ఏపీ ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్న వెంకట నారాయణ ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన డైరీని విడుదల చేశారు. కార్యక్రమంలో పీవీఎల్‌ఎన్ రాజు ముదిరాజు, మద్దం కోటేశ్వరరావు ముదిరాజు, వెంకటేశ్వరరావు ముదిరాజు, మహిళా నాయకురాలు బోడి మాధవి ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): శ్రీరాముని భక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు చేపట్టిన గంగోత్రి–రామేశ్వరం యాత్ర ఆదివారం కొండపల్లి గ్రామానికి చేరుకుంది. 2023 జూన్ 2 వ తేదీన ఆయన గంగోత్రిలో భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తూ గంగోత్రి–రామేశ్వరం యాత్ర చేపట్టారు. యాత్ర కొండపల్లి చేరిన సందర్భంగా స్థానిక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, షాబూఖారీ దర్గా పీఠాధిపతి మహ్మద్ అల్తాఫ్ రజాతో పాటు పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. యాత్రికుడు ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ గంగోత్రి నుంచి రామేశ్వరానికి భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, లోక కల్యాణమన్నారు.
అవనిగడ్డ: స్థానిక లంకమ్మ అమ్మవారిని జిల్లా జడ్జి బాబు నాయక్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు బాబు నాయక్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. పలువురు న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


