సహకరించిన మరో ఇద్దరి అరెస్టు
గూడూరు: రామరాజుపాలెంలో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరసా నాగరాజు కేసులో అతని భార్య పరసా జ్యోతి ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమెకు సహకరించిన కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులు, పుల్లేటి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మృతుడు పరసా నాగరాజు భార్య జ్యోతి, కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులుతో కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ఇది నచ్చని నాగరాజుకు భార్యను పద్ధతి మార్చుకోవాలని వారిస్తున్నాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలిసిన నాగరాజు సోదరులు పద్ధతి మార్చుకోవాలని జ్యోతిని మందలించారు.
దీంతో నాగరాజును ఎలాగైనా చంపేయాలని తటవర్తి ఆంజనేయులుతో కలసి పథకం రచించింది. 10 తేదీ రాత్రి వేళ మద్యం సేవించి వచ్చిన పరసా నాగరాజు ఇంట్లో మంచంపై మత్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతి.. ఆంజనేయులకు సమాచారం ఇచ్చింది. అతను తనకు తోడుగా పుల్లేటి నాగరాజు అనే యువకుడిని కూడా తీసుకువచ్చాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న నాగరాజు కాళ్లను పుల్లేటి నాగరాజు గట్టిగా పట్టుకోగా ఆంజనేయులు, జ్యోతి కలిసి మెడకు తుండు చుట్టి ఊపిరాడనీయకుండా చేసి హతమార్చారు. నాగరాజు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న ఆంజనేయులు, తనతో వచ్చిన పుల్లేటి నాగరాజును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో జ్యోతి తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ... నిద్రపోతున్న తన కుమారుడిని లేపి తండ్రి చనిపోయిన విషయం చెప్పి బంధువులకు సమాచారం ఇచ్చింది. అయితే పరసా నాగరాజు మృతిపై తమకు అనుమానం ఉందని అతని సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హంతకులను సాక్ష్యాధారాలతో పట్టుకుని, కోర్టుకు హాజరుపర్చారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై సీహెచ్ దివ్య ప్రకాష్, ఏఎస్సై స్వాములు, సిబ్బందిని సీఐ అభినందించారు.
పెదపాలెం(నాగాయలంక): గ్రామంలోని పేద దళితుడి ఇల్లును ఆదివారం కూల్చేశారు. 40 ఏళ్ల క్రితం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెదపాలెం కాలువ గట్టుపై సిమెంట్ రేకులతో ఇల్లు నిర్మించుకుని జీవిస్తుంటే దౌర్జన్యంగా పొక్లెయినర్‌తో కూల్చేసి వీధిపాలు చేశారని నాంచారయ్య కుటుంబం గగ్గోలు పెట్టింది. ఆదివారం ఉదయాన్నే తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్, ఎస్.ఐ కలిదిండి రాజేష్ సమక్షంలో పంచాయతీ అధికారులు గృహాన్ని పడగొట్టారు. గ్రామం పరిధిలోని సౌత్‌చానల్ డైరెక్ట్ పంట కాలువ గట్టుపై ఆక్రమణలో ఉన్న ఈ గృహాన్ని తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పంచాయతీని కోరిన మీదట ఈ చర్య చేపట్టినట్లు కార్యదర్శి సునీల్‌కుమార్ చెప్పారు.
పెద నాంచారయ్య ఇంటిని కూల్చి వేసిన ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు దళితులపై ఉన్న అసలు వైఖరిని బహిర్గతం చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ విమర్శించారు. కోర్టు స్టే ఆర్డర్ కేసు పెండింగ్‌లో ఉన్నా కూల్చేయడం దారుణమని రమేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్‌లో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు నిలయమైన పెద్దల విగ్రహాలు అధికార యంత్రాంగానికి కనిపించవని మారుమూల ప్రాంతంలో జీవనం సాగిస్తున్న పేద దళితుడు మాత్రం ఆక్రమణ దారుడిగా కనిపిస్తాడని ఆయన విమర్శించారు.


