మచిలీపట్నంఅర్బన్: నాలుగో తరగతి చదువుతున్న తన కుమారుడికి వైద్యం చేయించేందుకు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి అందరికీ ‘రోల్ మోడల్’గా నిలిచారు. కలెక్టర్ బాలాజీ శనివారం సాధారణ పౌరుడిలా తన బిడ్డకు వైద్యం చేయించడానికి మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం ఉంచుతూ స్వయంగా ఆస్పత్రిని ఆశ్రయించడంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు.
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 45 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ సివిక్స్ పేపర్–1 పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 1,923 మంది విద్యార్థులు నమోదు కాగా, 1,726 మంది హాజరయ్యారన్నారు. 197 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ మేరకు మొత్తం హాజరు 90 శాతంగా నమోదైందన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, సెట్–3 పేరును వినియోగించినట్లు డీఐఈఓ తెలిపారు.


