వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీ పట్నం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పదో తరగతికి సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2027 ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తొమ్మిదో తరగతి నుంచే పదో తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. దీని కోసం ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రత్యేకాధికారులు శ్రద్ధ చూపాలని పలు సూచనలు చేశారు. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం పదో తరగతి పాఠ్యాంశాలను చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి పాఠ్యాంశాలు చదువుకోవటం ద్వారా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. విద్యార్థులు చదివింది రాయటం, పునఃశ్చరణ చేసుకోవటం వల్ల సబ్జెక్టు ఎక్కువగా గుర్తుంటుందన్నారు. ఏకాగ్రత కోసం ప్రాణాయామాలు చేయాలన్నారు. క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అవసరమైతే ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెల్‌ఫోన్, టీవీలకు దూరంగా ఉంచి పిల్లలు చదువుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. బాగా చదువుకునేందుకు పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పోషకాహారంపై శ్రద్ధ పెట్టాలన్నారు. తరచూ పదో తరగతి సిలబస్‌పై పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టే భరోసా, ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


