41 సిలిండర్లు స్వాధీనం
పెనమలూరు: గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ అక్రమ వినియోగంపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మండల పరిధిలోని పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెనమలూరు, మొవ్వ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన డెప్యూటీ తహసీల్దార్‌ల బృందం శనివారం దాడులు చేశారు. గృహావసరాలకు ఉపయోగించాల్సిన వంట గ్యాస్‌ను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపులు, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు.
రేపటి నుంచి రైతన్న మీకోసం వారోత్సవాలు
జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి
కంకిపాడు /గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా రైతులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలో తిరిగి ఇదే నెలలో 23 నుంచి 25వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ ఉద్యాన సహాయకులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన లేఖలోని సందేశాన్ని అందించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తామన్నారు. రైతుల నుంచి వారికి కావలసిన సమాచారాన్ని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక ఇతర అనుబంధ శాఖల వారు సేకరిస్తారన్నారు. తదనుగుణంగా 2026 – 27వ సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారన్నారు. జిల్లాలోని రైతులందరూ రైతన్న మీకోసం వారోత్సవాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జేడీఏ పద్మావతి కోరారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది విద్య ఒక్కటేనని, దానిని అందించే గురువులు కూడా అంతే శక్తివంతమైనవారని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. శనివారం పోరంకి భాష్యం బ్లూమ్స్‌లో బ్లూమ్స్ బ్లూమ్రాంగ్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డ ఏ విధంగా గురువుల చేతిలో తీర్చిదిద్దబడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ పిల్లలు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీయాలని సూచించారు. మరో అతిథి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ తరన్నుమ్ మాట్లాడుతూ పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం జెడ్‌ఈఓ జోషి, పోరంకి భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, గుంటూరు భాష్యం బ్లూమ్స్ జెడ్‌ఈఓ అండ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


