పది పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 15 2026 4:52 AM | Updated on Mar 15 2026 4:52 AM

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

జిల్లాలో పరీక్షలకు హాజరుకానున్న 22,232 మంది విద్యార్థులు

148 పరీక్ష కేంద్రాలు

పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు

మచిలీపట్నంఅర్బన్‌: ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 411 హైస్కూళ్లకు చెందిన 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదై ఉన్నారన్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 21,296 మంది కాగా, ప్రైవేట్‌ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది ఉన్నారని, ప్రైవేట్‌ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మూడు డివిజన్లలో...

జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డివిజన్‌లో 7,692 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 264 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 7,956 మంది పరీక్షలకు హాజరవుతారు. ఈ డివిజన్‌లో 13 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్‌లో 118 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్‌, 341 మంది ప్రైవేట్‌ విద్యార్థులు కలిపి మొత్తం 6,803 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ డివిజన్‌లో 9 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు డివిజన్‌లో 120 పరీక్ష కేంద్రాల్లో 7,142 మంది రెగ్యులర్‌, 331 మంది ప్రైవేట్‌ విద్యార్థులు కలిపి మొత్తం 7,473 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక్కడ 7 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం

విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను చూపించి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని డీఈవో తెలిపారు.

పరీక్ష కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో మచిలీపట్నం డివిజన్‌లో 173 పాఠశాలలు, గుడివాడ డివిజన్‌లో 118, ఉయ్యూరు డివిజన్‌లో 120 పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్‌ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాల పంపిణీ కోసం 10 రూట్లను గుర్తించి 20 మంది రూట్‌ అధికారులను నియమించారు. ఎనిమిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 205 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 205 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, అదనపు చీఫ్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్‌ కస్టోడియన్లను నియమించారు. మొత్తం 1,562 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. విద్య, రెవెన్యూ, పోలీస్‌ శాఖల సమన్వయంతో 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.

భద్రతా ఏర్పాట్లు

పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.

పరీక్ష సమయం

ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు కనీసం 50 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను కూడా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తానని డీఈవో పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం, సందేహాలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కాలంలో కంట్రోల్‌ రూమ్‌లో కె. గణేష్‌ (9491505378), వై.ప్రసాదరావు (9441665999), కె.నాగరాజు (7702427788), బి.నాగమల్లేశ్వరరావు (9849501067) 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ ఫోన్‌ కాల్స్‌ స్వీకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement