రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న మంత్రి కొల్లు చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం దక్షిణ మండలంలో సముద్రతీర ప్రాంతాల రైతుల జీవనోపాధిని మంత్రి కొల్లు రవీంద్ర దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లా డుతూ.. సముద్రతీర ప్రాంతాలైన గరాలదిబ్బ, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, కోన, తుమ్మల చెరువు, కేపీటీ పాలెం, వాడపాలెం, రుద్రవరంలో 60 శాతం వ్యవసాయ భూముల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉండటం వల్ల వ్యవసాయానికి పనికిరావన్నారు. ఈ భూముల్లో ప్రత్యామ్నాయంగా రొయ్యలు, చేపల చెరువులు తవ్వి సాగు చేసుకునే రైతులకు మంత్రి కొల్లు రవీంద్ర చేష్టలు శాపంగా మారాయన్నారు. మూడు, నాలుగు నెలలుగా మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కువగా విజయవాడలోనే నివసిస్తున్న నేపథ్యంలో ఈ మండలానికి తన ప్రతినిధులుగా మాజీ ఎంపీపీ, సర్పంచ్ కుమారుడి నియమించారని తెలిపారు. ఈ గ్రామాల్లో ఎక్కడ చెరువులు తవ్వినా, మరమ్మతులు చేపట్టినా వారి చెయ్యి తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓ గ్రామంలో ఈ ఇద్దరు నాయకుల వసూళ్ల దందాను రైతులు టీడీపీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆ సర్పంచ్ ఇద్దరు నాయకులను దీనిపై ప్రశ్నించగా మరమ్మతులు కుదరవని, ఈ ప్రాంతంలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ రానుందని చెప్పారని పేర్కొన్నారు. దీంతో ఆ సర్పంచ్ నివ్వెరపోయాడని చెప్పారు. మరో పక్క వ్యవసాయానికి అనువుగా లేని పొలాల్లో చెరువులు తవ్వకూడదని రెవెన్యూ అధికారులు కూటమి నాయకులకు వంత పాడుతూ కరాఖండిగా చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న చెరువులకు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లీజు వస్తున్న పరిస్థితుల్లో వేసవిలో మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందని, అయితే ఆ పనులు చేయొద్దని నాయకులు, అధికారులు అడ్డం పడుతుంటే రైతులు ఎలా బతకాలని పేర్ని నాని ప్రశ్నించారు.
కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వొచ్చుగా..
జీవనోపాధి కోసం రైతులు చెరువులకు మరమ్మతులు, చెరువుల తవ్వకాలు చేపడితే కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఓ దినపత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన వార్తపై పేర్ని నాని స్పందించారు. కేవలం ఆ పత్రికకే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆదేశాలు ఉంటే కలెక్టర్ బాలాజీ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్ని ప్రశ్నించారు. సోలార్ ప్లాంట్‌ను తీసుకురావడానికి అనుమతులు ఉన్నాయా, ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరో లాభం కోసం రైతులు నష్టపోవాలని సూటిగా ప్రశ్నించారు. చెరువుల మరమ్మతులు, తవ్వకాలను అనధికారికంగా ఎందుకు నిలుపుదల చేస్తున్నారని రెవెన్యూ అధికారులను పేర్ని నాని ప్రశ్నించారు. రైతులను బాధపెడితే రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు మందా బాబూరావు, ఐనం తాతారావు, చలమలశెట్టి గాంధీ పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్ పేరుతో ధనార్జనకు శ్రీకారం
7 వేల నుంచి 8 వేల ఎకరాల్లో సోలార్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రచారం
అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిన రెవెన్యూ యంత్రాంగం
తీరుమారకుంటే రైతులతో కలిసి రెవెన్యూ కార్యాలయాలను ముట్టడి చేస్తాం
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని
ఇదేనా సంపద సృష్టి ..!
చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రికార్డు స్థాయిలో అప్పులు చేయడమే సంపద సృష్టా అని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, అన్ని తానై నడుపుతున్న కీలక మంత్రి నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం, అభివృద్ధి చేస్తా మని ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించేందుకు సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పి అధికా రంలోకి వచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 60 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పుతో ప్రజలకు సంక్షేమం, రోడ్ల అభివృద్ధి, విద్యావ్యవస్థలో నూతన మార్పులతో పాటు అనేక రంగాల్లో నిధులు వెచ్చించి అభివృద్ధి బాటలో పయనించారని గుర్తుచేశారు. అప్పుడు రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారవుతోందని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, ఆయన వదిన పురందరేశ్వరి, పవన్‌కల్యాణ్ గగ్గోలు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ మంగళవారంతో కలిపి కేవలం 22 నెలల్లోనే రూ.3.33 లక్షల కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టించిందని, అందుకు అభినందనలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చేస్తున్న అప్పులపై పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకులు మాధవ్, పురందరేశ్వరి ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.