చిలకలపూడి(మచిలీపట్నం): పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించటమే జాతీయ లోక్‌అదాలత్ ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో బుధవారం జడ్జిలు, న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి గోపీ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లాలో జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆయా కోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయవాదులు, పోలీసులు, ఇతర అధికారులు సహ కరించాలని కోరారు. సత్వర న్యాయం పొందటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఇటీవల కృష్ణాజిల్లా పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీడియేషన్‌పై ప్రత్యేక సదస్సు నిర్వహించి కేసుల పరిష్కరానికి కృషి చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. చిన్న, చిన్న తగాదాలను పరిష్కారం చేసుకో వటం ద్వారా గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి లోక్‌అదాలత్ దోహదపడుతుందని సూచించారు. గత లోక్ అదాలత్‌లో రాష్ట్రస్థాయిలో కృష్ణాజిల్లా నాల్గో స్థానంలో నిలిచిందని, ఈ సారి మొదటి స్థానం సాధించేందుకు జడ్జిలు, న్యాయవాదులు, పోలీస్ అధికారుల పరస్పర సహకారంతో కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.రామకృష్ణయ్య, జడ్జిలు జి.వెంకటేశ్వర్లు, బి.బాబునాయక్, ఎస్.సుజాత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు, న్యాయవాదులు పుప్పాల శివరామకృష్ణప్రసాద్, పేర్ని సురేష్, గంజి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ


