అభివృద్ధి పథానికి ఐదేళ్లు..! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథానికి ఐదేళ్లు..!

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

అభివృద్ధి పథానికి ఐదేళ్లు..!

వీఎంసీకి వైఎస్సార్‌సీపీ పాలకపక్షం ఏర్పడి ఐదేళ్లు బెజవాడను అభివృద్ధి పథంలో నడిపిన వైఎస్సార్‌ సీపీ మారిన రహదారులు, డ్రైయిన్ల రూపురేఖలు ప్రధాన ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాలు కూడా అభివృద్ధి నేడు ఆఖరి కౌన్సిల్‌ సమావేశం

పటమట(విజయవాడతూర్పు): బెజవాడ అభివృద్ధి బాటపట్టి ఐదేళ్లయింది. విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ)కు వైఎస్సార్‌ సీపీ పాలకపక్షం ఏర్పడి ఈ నెల 18వ తేదీతో ఐదేఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. విజయవాడ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 64 డివిజన్లు ఉండగా సెంట్రల్‌ నియోజకవర్గంలో 22 మంది కార్పొరేటర్లు, విజయవాడ తూర్పునకు 22 మంది, పశ్చిమకు 20 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించారు. వారిలో 2021 మార్చి 18వ తేదీన ఏర్పడిన కౌన్సిల్‌ల్లో వైఎస్సార్‌సీపీ నుంచి 49 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహించగా టీడీపీ నుంచి 14 మంది, సీపీఎంకు ఒక సభ్యుడు కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఐదుగురు కో–ఆప్షన్‌ సభ్యులుగా నియామకం అయ్యారు. 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కేటాయించి, మేయర్‌ కూడా మహిళ జనరల్‌కు కేటాయించటంతో విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి 46వ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికై న బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని 12వ మేయర్‌గా ఎన్నుకున్నారు. విజయవాడ నగర పాలక సంస్థకు పదవీ కాలం ముగియకముందే మేయర్‌ను మార్చే ఆనవాయితీ ఉండేది. ఐదేళ్లపాటు మేయర్‌గా పదివిలో ఉన్న వారిలో రాయన భాగ్యలక్ష్మి ఐదో వ్యక్తి. ఇక తొలిసారిగా ఇద్దరు డిప్యూటీ మేయర్లను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించగా 15వ డివిజన్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన బెల్లందుర్గ, 58వ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించిన అవుతు శైలజరెడ్డి కౌన్సిల్‌ సభ్యులు ఎన్నుకున్నారు.

మారిన నగర రూపురేఖలు..

వీఎంసీ పాలకపక్షం ఏర్పాడే నాటికి ఉన్న ఆదాయ వనరులను మరింత పెంచి నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపారు. నగరంలోని రోడ్లు, మేజర్‌, మైనర్‌ అవుట్‌ఫాల్‌ డ్రైయిన్లు, కొండ ప్రాంతాల రక్షణకు రిటర్నింగ్‌వాల్‌, సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న కేటీరోడ్డు విస్తరణ–ఆధునీకరణ, రాజీవ్‌గాంధీ పార్కు, రాఘవయ్యపార్కు, అంబేడ్కర్‌పార్కు అభివృద్ధితోపాటు అజిత్‌సింగ్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డులో నూతనంగా నాలెడ్జ్‌ పార్కు అభివృద్ధి, ఆధునీక వసతులతో ట్రాన్‌ఫర్‌స్టేషన్‌ నిర్మాణం జరిగింది.

ముంపు నుంచి శాశ్వత పరిష్కారం..

ఇంకా నగరానికి ప్రధానంగా కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదికి వరద వచ్చే వరద ప్రమాదాన్ని నిరోధించేందుకు రిటర్నింగ్‌ వాల్‌ నిర్మా ణం, ఇదే ప్రాంతంలో ఆధునిక వసతులతో రివర్‌ ఫ్రంట్‌ పార్కు నిర్మాణం, లెనిన్‌సెంటర్‌ పార్కు అభివృద్ధి, భవానీపురం, విద్యాధరపురంలో స్మార్ట్‌ రోడ్ల నిర్మాణం, లబ్బీపేటలో ఈట్‌ స్ట్రీట్‌ నిర్మాణం, నగరంలోని మూడు ఇండోర్‌ స్టేడియాలను ఆధునీకరణ, వసతలు మెరుగుదల చేశారు. రామలింగేశ్వరనగర్‌, ఆటోనగర్‌, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఆధునీకరించటం చేశారు. ఇంకా తాగునీటి వసతిని మరింత మెరుగుపరచేందుకు పటమట, సత్యనారాయణపురం, కృష్ణలంక, అజిత్‌సింగ్‌నగర్‌, భవానీపురం, రామకృష్ణాపురం, మధురానగర్‌, వాంబేకాలనీ ప్రాంతాల్లో నూతనంగా రిజర్వాయర్లు నిర్మాణం, భవానీపురంలోని హెడ్‌వాటర్‌ వర్క్స్‌ ఆధునీకరణ, కొండప్రాంతాల సరఫరాకు జరిగే లీకేజీలను అరికట్టి నూతన పైపులైన్లు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.

రెండుసార్లు అవార్డులు:

గడచిన ఏళ్ల కాలంలో జాతీయ స్థాయిలో జరిగే స్వచ్చ సర్వేక్షన్‌ ర్యాంకింగ్‌లో రెండుసార్లు మెరుగైన ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య నగరంగా తిర్చిదిద్దారు. ఇంకా క్లాప్‌(క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) ద్వారా ఇంటి వద్దనే చెత్త సేకరణను శ్రీకారం చుట్టి నగరంలోని 286 సచివాలయాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల ద్వారా చెత్త సేకరించి జాతీయ స్థాయిలో అవార్డును సాధించింది. 2021లో జాతీయ స్థాయిలో మూడోర్యాంకు, 2022లో మొదటి 10 ర్యాంకింగ్‌లో స్థానం, 2023లో ఆరోవ ర్యాంకు, 2024–25లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన వసతుల కల్పనకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వీఎంసీకి ఏటా రూ. 100 కోట్ల, రూ.50 కోట్లు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఏడాది ప్రత్యేక నిధులు కేటాయింపుల చేసి నగరవాసుల సమస్యలను త్వరితగతిన పూర్తి చేయటానికి కృషి చేశారు.

కౌన్సిల్‌ ఎజెండాపై మేయర్‌ సమావేశం

బుధవారం కౌన్సిల్‌ సమావేశం జరగనున్న నేపద్యంలో మేయర్‌ భాగ్యలక్ష్మి మంగళవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. కౌన్సిల్‌ ఎజెండా, అడిషనల్‌ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ (జనరల్‌) ఎ.రవీంద్రరావు, సెక్రటరీ ఇంచార్జి కె. ప్రభుదాస్‌, చీఫ్‌ సిటీ ప్లానర్‌ సంజయ్‌ రత్నకుమార్‌, చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.అర్జునరావు, ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజనీర్‌ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) జి.సృజన, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఎ.శ్రీధర్‌, సూపరిండెంటింగ్‌ ఇంజనీర్‌ వి. చంద్రశేఖర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (యుసిడి) ఎం.విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement